Sunday, November 24, 2024

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అదే విధంగా పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలం గాణ రాష్ట్రానికి కొత్త  గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్ వచ్చినందున కొత్తగా నియా మకాలు జరిపే అవకాశం లేదని చెబుతున్నారు. ఎపి గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం లో గవర్నర్‌గా నరసింహన్ ఉండే వారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడి గవర్నర్ గా ఆయన ఐదేళ్ల పాటు ఉన్నారు. తర్వాత ఎపికి కొత్త గవర్నర్‌ను నియమించారు. నరసింహన్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనను కొనసాగించ లేదు. తమిళిసై సౌందరరాజన్‌ను నియమించారు.
ఎపికి మొదట ఒడిషాకు చెందిన బిశ్వభూషణ్‌ను తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన అబ్దుల్ నజీర్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకూ ఇంచార్జ్‌గా ఎపి గవర్నర్ వ్యవహరించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తమిళిసై చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి నుంచి తమిళిసై లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలిసింది. గవర్నర్‌గా వచ్చే ముందు బిజెపి తమిళనాడు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడిఎంకె కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డిఎంకె అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తమిళిసైను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది.
దూకు డైన నేతగా పేరున్న తమిళిసై గవర్నర్ పదవి విషయంలో ఇబ్బంది పడ్డారు. బిఆర్‌ఎస్ సర్కార్ ఆమెకు ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి వివాదాలు రాలేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతోనే కొంత కాలంగా ఆమె తన ప్రయత్నాలను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో బిజెపి పరిస్థితి మెరుగుపడిందని, ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నారు.
మిమ్మల్ని ఎప్పటికీ మరువను : తమిళిసై
నేను ఎప్పటికీ మీ సోదరినే… తెలంగాణను వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది… ఈ ప్రాంత ప్రజలను ఎన్నటికీ మరువనని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అంశంపై ఆమె సోమవారం స్పందించారు. తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానన్నారు. నాపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. సోమవారం మధ్యాహ్నం ఆమె శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి బయలుదేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News