Sunday, January 19, 2025

తమిళనాట హిందీ వివాదం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ హిందీ వాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఖండించారు. చెన్నైలోని దూరదర్శన్ కేంద్రం స్వర్ణోత్సవం నేపథ్యంలో హిందీ మాసోత్సవ నేపథ్యంలో స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఘటనపై స్టాలిన్ శుక్రవారం తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ రవి ఉద్ధేశపూర్వకంగానే ద్రవిడ పదం లేకుండా మాట్లాడారని, అదే విధంగా ఇక్కడ ఆలాపించిన గేయంలో కూడా ఈ పదం తీసివేశారని, దీనిని గవర్నర్ ప్రోత్సహించారని విమర్శించారు. కేంద్రం ఇప్పటికైనా గవర్నర్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. దూరదర్శన్ ఉత్సవం తీరుపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.

హిందీయేతర రాష్ట్రం తమిళనాడు. హిందీ మాట్లాడని రాష్ట్రాలలో ఈ విధంగా హిందీ ఉత్సవాలను దూరదర్శన్ ద్వారా నిర్వహించడం కేంద్రం హిందీ రుద్దుడు ధోరణికి ప్రతీక, పెత్తనానికి ప్రతీక అని స్టాలిన్ మండిపడ్డారు. ఇప్పటి ఘటనపై డిఎంకెకు చెందిన విద్యార్థి విభాగం కూడా నిరసనలకు దిగింది. కేంద్రం చర్యలు ఏకపక్షం అని విమర్శించారు. బహుళభాషాత్మక దేశంలో ఒకే ఒక్క భాషకు ఎక్కువ గౌరవం ఆపాదించడం అనుచితం అవుతుందని స్టాలిన్ కేంద్ర వైఖరిని తప్పుపట్టారు. ఇతర భాషలను చిన్నచూపు చూసేందుకే ఇటువంటి చర్యలకు దిగారని విమర్శించారు. హిందీకి పట్టం కట్టే ధోరణి కుదరదని , దీనికి బదులు రాష్ట్రాలలో ప్రాంతీయ భాషల మాసోత్సవం నిర్వహించడం సముచితం అవుతుందని తెలిపారు.

ఈ మేరకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. కాగా డిఎంకె విద్యార్థి విభాగం సభ్యులు శుక్రవారం డిడి తమిళ కార్యాలయం ఎదుట గుమికూడారు. ఇక్కడ శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ వచ్చినప్పుడే విద్యార్థి విభాగం నిరసన సాగింది. బిజెపి ప్రభుత్వం తరచూ హిందీయేతర రాష్ట్రాలపై హిందీని జొప్పించేందుకు యత్నిస్తోందని విభాగం అధ్యక్షులు ఆర్ రాజీవ్ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలోని డిఎంకె ఇతర పార్టీలు తమిళనాడులో హిందీ విధింపును వ్యతిరేకిస్తున్నాయి. అయితే కేంద్రం కావాలనే ఇటువంటి పనులతో చిచ్చు రగులుస్తోందని ఆయన మండిపడ్డారు. అయితే ద్రవిడ పదం లేకుండా చేయడం వెనుక గవర్నర్ తప్పిదం ఏదీ లేదని , గీతాలాపనకు దిగిన వారి పొరపాటు ఏమీ లేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అయితే వివాదం నెలకొనడంతో వెంటనే గవర్నర్ కార్యక్రమ నిర్వాహకులతో మాట్లాడినట్లు కూడా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News