Saturday, November 23, 2024

తమిళ రాజ్‌భవన్‌కు కత్తెర!

- Advertisement -
- Advertisement -

Communal clashes during Ram Navami procession ‘విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (విసి) నియామకంలో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి నిర్ణయం తీసుకునే సత్సంప్రదాయం ఇటీవల కొంత కాలంగా కనుమరుగైంది. గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్లు విసిల నియామకంపై తమకే తిరుగులేని అధికారాలున్న చందంగా వ్యవహరిస్తున్నారు’. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకంపై అధికారాలను ప్రభుత్వానికి దత్తం చేసే రెండు బిల్లులను శాసన సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పలికిన పలుకులివి. బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల గవర్నర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం బుసకొట్టే పాములుగా ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి స్పందనగా ఆయా రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు పురుడుపోసుకుంటున్నాయి. రాజ్‌భవన్లు బిజెపియేతర పార్టీల సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం నిఘా వుంచి వాటిపై వ్యతిరేక సమాచారాన్ని కేంద్రానికి అందించే ఏజెంట్లుగా మాత్రమే పని చేసే ఒక దుష్ట విధానానికి ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రాణం పోసింది. బిజెపియేతర పార్టీల పాలనలోని ఏ రాష్ట్రంలో చూసినా గవర్నర్‌కు ముఖ్యమంత్రికి మధ్య పచ్చిగడ్డి కూడా భగ్గుమంటూ వుంటుం ది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మంచి పథకాలను కూడా అడ్డుకోడంలో గవర్నర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తూ వుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధంకర్ మమతా బెనర్జీ ప్రభుత్వ పాలనా రథానికి అడుగడుగునా అడ్డుపడుతూ వార్తలకెక్కుతుంటారు. ఆయన గత జనవరి 25న మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింస పెచ్చుమీరిందని, ఏ ఇతర రాష్ట్రంలోనూ లేనంతగా భయం గూడుకట్టుకున్నదని వ్యాఖ్యానించారు. ఓటర్ల స్వేచ్ఛ కు బెంగాల్‌లో ముప్పు వాటిల్లుతున్నదని కూడా వ్యాఖ్యానించారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులను ఒక ఎంఎల్‌ఎని సిబిఐ అరెస్టు చేసిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుతూ గవర్నర్ అక్రమ, అనైతిక అనుమతితోనే ఈ అరెస్టులు జరిగాయని వ్యాఖ్యానించారు. ధంకర్ అతి తరచుగా రాష్ట్ర ప్రభుత్వంతో పేచీలకు దిగుతుంటారు. గవర్నర్లు ఏ విధంగా వ్యవహరించరాదో ఒక పుస్తకం రాయాలంటే ధంకర్ ప్రవర్తనను, నిర్ణయాలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఆయన హద్దుమీరిన చర్యల కారణంగా పదవి నుంచి తొలగించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్న సందర్భం కూడా వున్నది. ఇంకా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ సైతం అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే చర్యలకు పాల్పడుతుంటారు. కోష్యారీ ని వెనుకకు పిలిపించుకోవలసిందని మహారాష్ట్ర పాలక కూటమి కేంద్రాన్ని ఒక దశలో కోరింది. ఆయన బిజెపి అనుకూల విధానాలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నారని ఎత్తి చూపింది. 2021 ఫిబ్రవరిలో కోష్యారీ ప్రభుత్వ విమానంలో డెహ్రాడూన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయన విమానంలో కూచున్నప్పటికీ అది కదలకపోడం అప్పుడు సంచలనం కలిగించింది. తమిళనాడులో నీట్ (ఎంబిబిఎస్ సీట్ల కేంద్రీకృత కేటాయింపు విధానం నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్టు) విషయంలో గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం తెలిసిందే.

నీట్ నుంచి తమిళనాడు విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ శాసన సభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిప్పి పంపించారు. నీట్ వల్ల తమిళనాడులోని పేద విద్యార్థులు ఎంబిబిఎస్ చదువుకునే అవకాశాలను కోల్పోతున్నారని, రాష్ట్ర స్థాయిలో మెరిట్‌ను నిరూపించుకున్నవారు కూడా నీట్‌లో సీటు రాకపోడంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలున్నాయని భావించి తమిళనాడు ప్రభుత్వం దానిని చిరకాలంగా వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర గవర్నర్‌గా అక్కడి ప్రజల మనోభావాలను గమనించి వ్యవహరించవలసిన బాధ్యతను గవర్నర్ రవి పక్కన పెట్టారు.

కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా మాత్రమే పని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కాళ్లకు అడ్డంపడుతున్నారు. ఇలా ప్రతి బిజెపియేతర రాష్ట్రంలోనూ రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. గవర్నర్ ఎప్పుడో గాని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోడం గతంలో వుండేది కాదు. గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా నడుచుకునే గొప్ప ప్రజాస్వామిక, రాజ్యాంగ సంప్రదాయాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఈ నేపథ్యంలోనే విశ్వవిద్యాలయాల విసిల నియామకాల విషయంలో గవర్నర్ల అధికారాలను సమూలంగా కత్తిరించి వేసే చట్టాలు బిజెపియేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో రూపొందుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News