Monday, November 25, 2024

ఖాతా నంబర్ ఇచ్చి కటకటాల్లోకి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కమీషన్ వస్తుందని ఆశపడి బ్యాంక్ ఖాతాలు ఇచ్చిన పలువురిని పోలీసులు కటకటాల్లోకి పంపిస్తున్నారు. సైబర్ నేరస్థులు తమ బ్యాంక్ ఖాతాలు, బంధువుల బ్యాంక్ ఖాతాల ద్వారా గతంలో నేరాలు చేసేవారు. వారి బ్యాంక్ ఖాతాలకు అమాయకులకు మాయమాటలు చెప్పి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకునేవారు. వాటిలో నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుని తీసుకునేవారు, ఇటీవలి కాలంలో పోలీసులు సైబర్ క్రైం నిందితులను బ్యాంక్ ఖాతాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేయడంతో వారు రూట్ మార్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు వారి చేతికి మట్టిఅంటకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న వారి బ్యాంక్ ఖాతాలను సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి నుంచి పలువురి బ్యాంక్ ఖాతాల వివరాలను తీసుకుని డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయిస్తున్నారు. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి తమకు ఎటిఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ఇవ్వడంతో వారికి కమీషన్‌ను ఎర వేస్తున్నారు.

తమకు ఎంతోకొంత డబ్బులు వస్తాయని ఆశపడి బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చిన వారు జైలు పాలవుతున్నారు. సైబర్ నేరాలు పెరగడంతో పోలీసులు సైబర్ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బ్యాంక్ ఖాతాదారుల వారితోనే సైబర్ నేరస్థులు బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయించుకుని డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు బ్యాంక్ ఖాతా నుంచి ట్రాన్స్‌ఫర్ చేసినందుకు బ్యాంక్ ఖాతాదారులకు 10శాతం కమీషన్ ఇస్తున్నారు, ఇలా చేసి సైబర్ నేరస్థులు తమ చేతికి మట్టిఅంటకుండా చూసుకుంటున్నారు. సోషల్ మీడియా, తదితర వాటిల్లో గుర్తుతెలియని వారితో ఛాటింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులు స్నేహం చేసినట్లు నటిస్తున్నారు. తర్వాత వారి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి దానిలో డబ్బులు డిపాజిట్ చేయిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళ సైబర్ నేరస్థులు బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే 10శాతం కమీషన్ ఇస్తామని చెప్పడంతో కొత్తగా బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి సైబర్ నేరస్థులకు ఇచ్చింది.

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన బాధితురాలు పార్ట్‌టైం జాబ్ పేరుతో మెసేజ్ రావడంతో దానికి స్పందించింది. కొద్ది రోజులకు నిందితులు తన ప్లాన్‌ను అమలు చేశారు. తాము చెప్పినట్లు పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితురాలు రూ.5లకు పైగా సైబర్ నేరస్థుల బ్యాంక్ ఖాతాకు పంపించింది. బాధితురాలి డబ్బులు వచ్చిన తర్వాత సైబర్ నేరస్థులు స్పందించడం మానివేశారు. బాధితురాలు మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాంక్ ఖతాను గుర్తించి తమిళనాడుకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే మహారాష్ట్రకు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రాంలో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొద్ది రోజులు స్నేహం చేశారు, తరచూగా ఛాటింగ్ చేసుకునేవారు. ఒక రోజు యువతి బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తే ఇంటి అద్దె రూ.3,000 ఇస్తానని చెప్పాడు.

ఉచితంగానే డబ్బులు వస్తున్నాయని తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపించింది. నిందితుడు వాటిని సైనిక్‌పురికి చెందిన బాధితురాలికి ఇచ్చి ఆమెను యువతి బ్యాంక్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు. తక్కువ డబ్బులకు ఎక్కువ లాభం వస్తుందని సదరు మహిళ లక్ష రూపాయలు డిపాజిట్ చేసింది. తర్వాత నుంచి నిందితుడు ఆమెకు అందుబాటులో లేకుండా పోయాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా గుర్తుతెలియని వ్యక్తికి బ్యాంక్ ఖాతా నంబర్ ఇవ్వడంతో యువతి కటకటాలపాలైంది.

కమీషన్‌కు ఆశపడితే….
చాలామంది బ్యాంక్ ఖాతాలు ఇచ్చే వారు సైబర్ నేరస్థులు భారీగా కమీషన్ ఇస్తామని చెప్పడంతో బ్యాంక్ ఖాతాలు కొత్తగా ఓపెన్ చేసి ఇస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిళ బ్యాంక్ ఖాతా ఇచ్చినందుకు డిపాజిట్ అయిన డబ్బుల్లో 10శాతం కమీషన్ ఇస్తామని ఆశ చూపెట్టారు. కష్టపడకుండానే డబ్బులు వస్తున్నాయని ఆశపడిన మహిళ బ్యాంక్ ఖాతాను సైబర్ నేరస్థులకు ఇవ్వడంతో కటకటాలపాలయ్యింది. ఇలా చాలామంది బ్యాంక్‌ఖాతాలను ఇవ్వడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. సైబర్ నేరాలు పెరగడంతో పోలీసులు బ్యాంక్ ఖాతాలు ఇస్తున్నవారిపై దృష్టి సారించారు. బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరస్థులకు అందకుండా చేస్తే కొంత వరకు కట్టడి చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గతంలో వదిలేసేవారు….
గతంలో పోలీసులు సైబర్ నేరస్థులకు బ్యాంక్ ఖాతాలను ఇచ్చిన వారిని వదిలేసేవారు. వారిని కూడా అమాయకులుగా భావించేవారు, కానీ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరగడంతో వీరిపై దృష్టిసారించారు. చాలా కేసుల్లో బ్యాంక్ ఖాతాలు ఇచ్చే వారు కమీషన్లు తీసుకుని ఇస్తున్నారని తెలియడంతో అదుపులోకి తీసుకుని జైలుకు పంపిస్తున్నారు. సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంక్ ఖతాల నంబర్లు ఇచ్చే వారు పరోక్షంగా సహకరిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇవ్వడం, డిపాజిట్ అయిన డబ్బులను సైబర్ నేరస్థులకు ట్రాన్స్‌ఫర్ చేసిన నేరమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News