Tuesday, November 19, 2024

కుబేరులకు దేశాన్ని దోచిపెడుతున్న మోడీ సర్కార్

- Advertisement -
- Advertisement -

Tammineni Veerabhadram criticized on modi govt

 

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు పెరిగి సమాజానికి మరింత చేటు జరిగే పరిస్థితి దాపురించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 209 మంది ధనవంతులు తమ ఆస్తులను పెంచుకున్నారని.. అదాని, అంబానీల ఆదాయం ఈ కొద్ది కాలంలో భారీగా పెంచుకోవడానికి మోడీ ప్రభుత్వ విధానాలు తోడ్పడ్డాయని, గౌతం ఆదాని లాంటి కుబేరులు ఏడాదిలోనే తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి కేంద్రం తోడ్పడిందని ఆరోపించారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మారుస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. హురున్ అంతర్జాతీయ ధనవంతుల జాబితా ప్రకారం సంపదంతా ధనికుల చేతుల్లోకి పోయే విధానాన్ని మోడీ అమలు చేశారని బట్టబయలైందని విమర్శించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద కార్పొరేట్లు లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొట్టి బ్యాంకులను దివాళా తీయిస్తున్నారని, వారిని మోడీ ప్రభుత్వం రక్షించుకుంటూ వస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించి, వాటిని కారుచౌకగా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ రంగాన్ని కేంద్రం ఏకపక్షంగా చట్టం చేసి, కేంద్రం స్థాయిలో రెగ్యులేటరీ అథారిటీని నియమించి రాష్ట్ర అధికారులను కుదించి ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తోందని.. దీంతో పెద్ద టారిఫ్ వినియోగదారులను ప్రైవేటు వారు ఆకర్షిస్తారని.. తక్కువ టారిఫ్ విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వ విద్యుత్ సంస్థల జాబితాలో చేరడంతో ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు దివాళా తీస్తాయని అన్నారు. కార్పొరేట్లు ఇప్పటికే ఉన్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను వాడుకుని కేవలం సీలింగ్ ఛార్జీలను మాత్రమే చెల్లించి, ఉద్యోగుల కుదింపు, వేతనాల తగ్గింపుతో పాటు, రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి లాభాలను మూటగట్టుకుంటారని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేయడంతో, రాష్ట్రాలు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశంలోని పేద, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలకు కారణమవుతున్న మోడీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాల్లోకి రావాలని, ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి సిద్ధం కావాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News