Sunday, January 19, 2025

బిజెపి మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కు: తమ్మినేని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి విడుదల చేసిన మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర నిర్లక్షం చేసిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వక పోగా.. విభజన చట్టాన్ని కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు. ఈ చర్య తీవ్ర ఆర్థిక దిగ్భంధానికి గురి చేసిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా శనివారం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు అంశాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడమే లేదన్నారు. దానిని తెలంగాణలో అమలు చేస్తానని ప్రకటించడం ప్రజలను మోసగించడమేనన్నారు.

ఇది ప్రజల్లో చీలిక తేవడంతో పాటు సంక్షేమ పథకాలకు కోత కోసే మ్యానిఫెస్టోగా ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు దీన్ని గమనించి ఈ ఎన్నికల్లో మతోన్మాద, ప్రజా వ్యతిరేక బిజెపిని దాని మిత్రపక్షాలను ఓడించి తగిన బుద్ది చెప్పాలని అన్నారు. 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్ర బిజెపి ప్రకటించి వాటికి ఎగనామం పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న లక్షలాది ఖాళీలు నింపకుండా, ఇక్కడ ఉద్యోగాల భర్తీ చేస్తామంటే నమ్మాలా? అని తమ్మినేని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలను పంపిణీ చేయకుండా ప్రాజెక్టులను ఆపిందన్నారు.

వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ మార్కెట్లను కార్పొరేటీకరించాలని నాలుగు నల్ల చట్టాలను తెచ్చిందని మండిపడ్డారు. 23 వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే ఆశాస్త్రీయ మద్దతు ధర నిర్ణయించి కార్పొరేట్ వ్యాపారులకు లక్షల కోట్ల లాభాలు ఆర్జించి పెడుతున్నదన్నారు. కానీ నేడు తెలంగాణలో వ్యవసాయానికి ఎరువులు, సబ్సిడీలు, ధాన్యానికి మద్దతు ధరలు అమలు చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని తమ్మినేని అన్నారు. ఎఫ్‌సి ద్వారా ధాన్య సేకరణ చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ముంచి, ఇప్పుడు రాష్ట్రంలో క్వింటాల్‌కు రూ.3100 లు ఇస్తామని చెబుతోందని విమర్శించారు. కేంద్రంలో పదేళ్ల నుండి అధికారంలో ఉన్న బిజెపి రూ.3100 లు మద్దతు ధరను ఎందుకు నిర్ణయించలేదని తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News