సిటీ బ్యూరో: తానా మహాసభలలో ఈసారి సామాజిక న్యాయ కోణంలో బహుజన వాదంపై సమాలోచనలు నిర్వహించడం, గొప్పగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. ప్రపంచంలోని తెలుగు వారంతా ఒకటే అని చాటి చెప్పి, సమైక్య పూరితంగా నినదించడంలో ఈ 23వ తానా మహాసభలు నిదర్శనంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు ఆరంభమైన తానా మహాసభల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తానా ఆహ్వానం మేరకు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ సభలకు ఆత్మీయ అతిథిగా డాక్టర్ వకుళాభరణం పాల్గొన్నారు. డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు నిర్విరామ కృషిని గుర్తిస్తూ ఈ సందర్భంగా తానా ఆయనను మహాత్మాపూలే పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఈ పురస్కారం తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, ప్రపంచ తెలుగు సా హిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర చేతుల మీదుగా ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా అక్కడ జరిగిన భారీ సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ ఈ సభలు తెలుగు జాతి ఔన్నత్యం, ఔచిత్యం సమున్నతంగా ఆవిష్కరించాయి కొనియాడారు. సమస్త నిమ్న వర్గాలు, బలహీన వర్గాలకు చెందిన వృత్తిదారులగురించి ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన బహుజన శతకం పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్పగా ఉందన్నారు. ఇలాంటి వైవిధ్య సరళిని అవలంబించి, ఆచరించి తానా కొందరిది కాదు అందరిదీ అని నిరూపించుకుందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి విశ్వ వేదికపై తనకు మహాత్మా పూలే పురస్కారం అందజేయడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన తానాకు కృతజ్ఞతలు తెలిపారు.