Monday, November 18, 2024

తెలంగాణ తెగువ ఠానునాయక్

- Advertisement -
- Advertisement -

భారతదేశ చరిత్రలో వీరత్వంలో, త్యాగంలో తెలంగాణ రైతాంగ పోరాటానికి మరేదీ సాటిరాదు.కానీ ఆ మహత్తర ఉద్యమ చరిత్ర ఇంకా మనకు తెలియకుండానేపోయింది. లంబాడ మహాపోరాట యోధుడు జాటోతు ఠాను నాయక్ 1950 మార్చి 20న ముండ్రాయి దొర గూండాలతో పోరాడుతూ వీర మరణం చెందాడు. నిజాం ప్రభుత్వం హోం డిపార్టుమెంట్ నివేదికలు పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణకు రాక ముందే ఠాను నాయక్ కుటుంబం దొరలను ఎదిరించి భూములపై తమ హక్కులను సాధించుకున్నది. ఒక విధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి బీజం వేసింది రాను నాయక్ కుటుంబమేనని నివేదికలు రుజువు చేస్తున్నాయి.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం విసూనూరు దేశ్‌ముఖ్ గుండాలను, నిజాం రజాకార్లను ఎదురించిన ధైర్యశాలి. ధర్మాపురం, లక్ష్మక్కపల్లి, రామన్నగూడెం, రామవరం, మొండ్రాయి గ్రామాలకు మక్తెదారులుగా ఉండి ప్రజలను పీల్చిపిప్పిచేసేవారు. మొండ్రా యి, ధర్మాపురంలోని లంబాడీ గిరిజనుల భూములను దొరలు ఆక్రమించారు. రెండు పంటలు పండే వంద ఎకరాలపైగా తరి, ఖుష్కి భూ ములను లంబాడీల నుంచి అన్యాయంగా ఆక్రమించుకొని ముప్పు తిప్పలు మూడు చెర్ల నీళ్లు తాగిస్తున్నారు. వత్తిడి, ఘర్షణ ఏం చేయాలి? సంఘం అండగా దున్నే వాడికి భూమి నినాదం రణ నినాదమైంది. భూమి వదులుకుంటే బువ్వ లేదు, బువ్వ లేకపోతే బతికేదెట్లా? జీవితమే యుద్ధమైంది. పోరాటం తప్ప మరో మార్గం లేదు. పోరుబాట పట్టారు గిరిజన వీరులు. 15 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న దొరోడికి వ్యతిరేకంగా ఈ తొలికేక దున్నేవాడిదే భూమి అన్న పొలికేకైంది. దొరోడి జీతగాళ్లను వడిసెలతో తరిమితరిమి కొట్టారు.

తిరిగి తమ భూములను నాగళ్లతో దున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి రజాకారు సైన్యాలతో తిరిగి ఆక్రమించుకున్నారు దొరలు. దీంతో పోరు మరింత ఉధృతమైంది. ఇంతలో దొడ్డి కొమురయ్య మరణం, ఆపై ఉప్పొంగిన సాయుధ పోరాట కెరటం సామాన్యుడిని సాహసవంతుడిగా మార్చింది. ప్రజలు కమ్యూనిస్టుల పిలుపునందుకున్నారు. సంఘం ప్రజలకు అండగా నిలిచింది. ప్రజలు కదిలారు. గెట్టు పొడుగున వెయ్యి మంది దాకా భూమి చుట్టూ నిలబడ్డారు. ప్రతి ఒక్కరి చేతిలో కర్ర వడిసెలు, సంకలో మూట (రాళ్లు)తో చావుకైనా సిద్ధమన్నట్టు నిలబడ్డారు. ఇది మా భూమి అంటూ ఎర్రజెండాలు నాటారు. సంఘ నాయకుడు ఎరమరెడ్డి మోహన్‌రెడ్డి ‘దున్నేవాడికే భూమి, ఎర్రజెండాకు జై, కమ్యూనిస్టు పార్టీకి జై’ అంటూ పోలీసులకెదురుగా కవాతు నడిపించారు. పోలీసులు ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

ప్రజల ఉత్సాహానికి అవధుల్లేవు. చుట్టు ముట్టు గ్రామాల్లో ఊరేగింపులు జరిగాయి. ఇదే క్రమంలో పగా, ప్రతీకారం కూడా ప్రారంభమైంది. ఈ పోరాటానికి స్థానికంగా నాయకత్వం వహించింది. ఠాను నాయక్. జాటోతు హాము, ముంగిబాయికి ఆరుగురు కొడుకులు. జోద్య, సోమ్ల, సాంక్రు, దర్గ్యా, ఠాను, దాసు. వీరు చిన్ననాటి నుండి ధైర్యవంతులు, దృఢ దీక్షగల వారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయే వారు కాదు. వీళ్లంత దళ కమాండర్‌గా, దళంలో సభ్యులుగా పని చేశారు. దళ కమాండర్‌గా ఉన్న ఠాను, దర్గ్యాల ఎన్నో కష్టాలు, మరెన్నో సాహస కృత్యాలు ప్రజల్ని ఎంతో చైతన్యం చేశాయి. దొరలకు ఈ తండాపై కసి తీరలేదు. ధర్మాపురం ఠానూ నాయక్ కుటుంబంపై బాబు దొర ముఠా దాడిచేసి ఆ రోజు దొరికిన ఠాను సోదరుడు సోమ్లా ఇంకో నలుగురిని పట్టుకొని వారితోనే వారి చెలకలోనే కట్టెలు తెప్పించి చితిపేర్పించారు.

భగభగ మండుతున్న మంటల్లో కాళ్లు చేతులు కట్టేసి సజీవంగా ఐదుగురిని తగులబెట్టారు. ఆ కసితోనే తండాకు వచ్చి మరో 20 ఇండ్లను తగులబెట్టి పైశాచికానందాన్ని పొందారు. అయినప్పటికీ ఠాను నాయక్ జాడ తెల్వలేదు. ఎవరు చెప్పడం లేదు. ఈలోపు ఠాను అన్నను, నల్లా నరసింహులుతోపాటు అరెస్టు చేసి ఉరిశిక్ష విధించారు. ఠాను మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఠాను పెద్దన్న జోద్య కుమారుడు జనార్దన్ 15 ఏండ్ల చిచ్చర పిడుగు. కమ్యూనిస్టు పార్టీకి రహస్య సమాచారాన్ని అందించి ఉద్యమానికి ఎంతో సహకరించారు. ఠాను నాయక్ రజాకార్లకు టార్గెట్‌గా మారాడు.

ఆయన ఆచూకి కోసం అనేక మంది ద్రోహులను నియమించుకున్నారు. చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మొండ్రాయికి సమీపంలో నున్న నీలిబండ తండాలో ఠాను నాయక్ అతని ఉద్యమ సహచరుడు కందూరు వెంకులును పోలీసులు పట్టుకొని మొండ్రాయి భూస్వాముల గడిలో ఒక బండి చక్రానికి కట్టేసి అతి కిరాతకంగా హింసించి చంపుతుంటే ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. కన్నీళ్లు పెట్టడం కాదు. కన్నీళ్లు కసిగా చేయడమే కమ్యూనిస్టు కర్తవ్యమంటూనే” కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్, రజాకార్ల రాక్షసత్వం నశించాలి” అంటూ మూడు తుపాకీ గుండ్లకు తుది శ్వాస విడిచాడు ఠానూ నాయక్. క్రమ శిక్షణ కలిగిన కమ్యూనిస్టు యోధుడే కాదు, తెలుగు, లంబాడీ భాషల్లో చక్కగా మాట్లాడి వేలాది మందిని చైతన్యపరిచి ఉద్యమంలో ఉరికించిన మంచి వక్త. నేటికీ మొండ్రాయి తండాల్లో ఆ వీరుడికి విగ్రహం పెట్టి సజీవంగా నిలుపుకుంటున్నారు.

జె. హనుము, 85198 36308

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News