Thursday, December 19, 2024

1200 మంది ఫోన్లు ట్యాప్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రం లో గత ఎన్నికల పోలింగ్ దాకా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని నిం దితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చా రు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, కుటుంబ స భ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్ర ముఖ పారిశ్రామికవేత్తలు. వ్యాపారస్తులు ఇలా 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు వెల్లడించారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా, 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ట్యాపింగ్ కొనసాగించామన్నారు.

ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నానని, అధికారికంగా మూడు ఫోన్లను ఉపయోగించానని, అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను మానిటర్ చేశానని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని, అనంత్, శ్రీనివాస్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్యాపింగ్ చేశామన్నారు. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ ఆపేశాం, పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులలో చూపించామన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుండి ఫోన్ ట్యాపింగ్‌ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారన్నారు.

ఆయన ఆదేశాలతో 50కొత్త హార్డ్ డిస్క్ లను తీసుకువచ్చి, పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లను ఫిక్స్ చేశామని వెల్లడించారు. 17హార్ట్ డిస్క్ లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. సిడిఆర్ తో ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామన్నారు. ల్యాప్ ట్యాప్ లు, పెన్ డ్రైవ్ లు, హార్ట్ డిస్క్ లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, తదితరాలను నాగోల్, ముసరాంబాగ్ సమీపంలోని మూసీనదిలో పారేశాం అని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. తాము ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు బేగంపేట నాలాలో పారేశామని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఫోన్ టాపింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని సూచించారని, ఆయన ఆదేశాలతోనే అలా చేశామన్నారు. ప్రస్తుతం ప్రణీత్ రావ్ వాంగ్మూలంలో పేర్కొన్న సమాచారం రాష్ట్రంలో పెను దుమారానికి దారి తీస్తోంది.

ఆ సమయంలోనే అంతా..
డిసెంబర్ 4వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 8.15 గంటల వరకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను చెరిపేశామని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కన్వర్జేన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్, అనంత్ ను ఎస్‌ఐబి ఆఫీస్‌కు పిలిచి, వారు ఇచ్చిన సర్వర్లు, హార్డ్ డిస్కులు వారికి ఇచ్చినట్లు ప్రణీత్‌రావు పోలీసులకు వెల్లడించారు. 50 హార్డ్ డిస్క్ లను తొలగించి కొత్త వాటినీ రీప్లేస్ చేశామని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఐ అనిల్ కుమార్ సిసి కెమెరాలను ఆఫ్ చేశారని, తమ ఆదేశాలు పాటించేందుకు అనిల్ కుమార్ మొదటి నిరాకరించగా.. చివరికి అతడిని భయపెట్టి సిసి ఆఫ్ చేయించినట్లు ప్రణీత్‌రావు పోలీసుల వద్ద చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News