చదవాల్సిన పుస్తకం
ఎం.ఎస్.నాయుడు భాషతో పెట్టుకున్న కవుల్లో మొదటివాడు కాకపోయినా మొదటి వరసలో ఉండేకవి. అసలు ఏ కవికయినా భాషతోనూ వ్యాకరణంతోనూ నిఘంటువులతోనూ ఇబ్బందులు తప్పవు. మనసు భాష, బాధ భాష తెలియజెప్పే భాషాశాస్త్రమింకా పుట్టలేదు. ఈ స్పృహ ఆధునిక యుగంలో తొలిసారిగా శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’లో కనిపిస్తుంది. ‘నా విన్నవి కన్నవి విన్నవించగా/మాటలకై వెదుకాడగబోతే/అవి పుంఖానుపుంఖంగా/ శ్మశానాల వంటి నిఘంటువుల దాటి / వ్యాకరణాల సంకెళ్ళు విడిచి/ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి / వెలువడినై / పరుగిడినై / నా యెదనడుగిడినై.. ‘అని రాశాడా నాడే శ్రీ శ్రీ. ఇక్కడ ‘నా యెదనడుగిడినై’ అనడంలో ఒక అంతరార్థముంది. ఎద భాష వేరు, మనం మాట్లాడే భాష, వినే భాష, చదివే భాష వేరు. కవులకు కావల్సినది ఆ ఎద భాషే. ఉపనిషద్వాక్యాల్లో చెప్పాలంటే ఆ భాష కళ్ళకు లోచూపునూ, చెవులకు అంతశ్శ్రవణ శక్తిని ఇస్తుంది. ఆ హృదయ భాషాస్రోతస్వినిని పట్టుకోడానికి వేగుంట మోహన ప్రసాద్ తరువాత అంతటి భగీరథ యత్నం చేసిన కవి ఎం.ఎస్.నాయుడు.
తను చెప్పదలచుకున్న విషయం (subject) ఎంత మామూలు (mundane) సంగతయినా, భాషతో వచ్చిన పేచీ వలన కవి పదాల అర్థాలను సంశయిస్తాడు, వాక్య నిర్మాణ నియమాలను ఉల్లంఘిస్తాడు, పదవాక్య క్రమాల్ని పరిహసిస్తాడు. అయి తే, ఎక్కడా పద వినియోగం మితంగా ఉండాలనే నియమాన్ని (economy of words) అతిక్రమించడు. ఈ కవి నిఘంటువులో మరీ ఎక్కువ పదాలేం లేవు. ఇతని వ్యాకరణ నియమాలు కొంచెం పరికించి చూస్తే అవగాహనలో కొచ్చేవే. ఒక పూటకూళ్ళవ్వ అట్లు దోరగా కాలడానికి గరిటెతో పెనం మీద పోసిన పిండిని ఇటూ అటూ తిప్పినట్టుగా ఉంటుంది ఈ కవి పదాల వరసక్రమం (syntax). భాషని భాషతోనే శుభ్రపరుస్తాడు ఈ కవి. ఎం.ఎస్.నాయుడి ఎదభాష అందరి ఎదభాషా అయేదాకా ఈ కవి తన తిరుగుబాటు పతాకను అలాగే పట్టుకొనుంటాడు. భాషను ప్రజాస్వామ్యీకరించడం, కవి సమయాల పై వ్యంగ్యాస్త్రాలు సంధించడం, పఠాభి, వేగుంట, దిగంబర కవుల వలేనే పూర్వకవితా రీతులపై, భాష భావార్థాలపై ప్రధాన స్రవంతి కవుల గుత్తాధిపత్యాన్ని సహించకపోవడం -ఇవన్నీ విప్లవాత్మకమైన ధోరణులే. ఈ కవి ఏకాంతమూ ఒక ధిక్కారమే. ఇందులో కవి ఏ వస్తువునూ ఏ భావాన్నీ కవులకు ఆలంబనైన దేన్నీ romanticize చెయ్యకపోవడం ఒక ప్రత్యేకత మాత్రమే కాక అందరికీ కనువిప్పు కూడా. లోగడ ‘ఒక వెళిపోతాను’ అన్నాడు. ధిక్కార స్వరంతో చేసిన ప్రవేశమే. ఇవి పాఠకులు కవిని ఓపిగ్గా చదవాల్సిన రోజులు. ఇందువల్ల పాఠకులకు ఏమొస్తుందీ అంటే, పుస్తకం మూసి దైనందిన జీవితంలోకి మళ్ళీ అడుగిడినప్పుడు ఎప్పుడో అనుకోకుండా గాలి ఆడనప్పుడో, వీచినప్పుడో చిట్లిన అద్దంలో ఏదో ఊహించని/అనుకోని (random) ప్రతిబింబం కానవచ్చినప్పుడు ఒక నిమిషం స్తంభించి పాఠకులు కవిని అసంకల్పితంగా తల్చుకుంటారు, వాస్తవికతను ఒక అర్థంలోకి నిర్మించే ప్రయత్నమూ చేస్తారు. ఇంకొందరు పాఠకులయితే పదాలు స్వతహాగా ఆహ్వానించే ఇతర పదాల్నే పేర్చుకుంటూ పోయి చివరికంతా చెరిపేస్తారు. అప్పుడు మిగిలే ఖాళీ తెల్ల కాగితం చక్కగా భాష్యం చెబుతుందీ కవిత్వానికి. ఎం.ఎస్. నాయుడు కవిత్వంలో రూపం పుష్టికరంగా ఉంటూనే, కవితా ఖండికల్లో విషయం పట్టుకు దొరకనట్టు గానూ సరిగ్గా అతుక్కోని భావార్థాల మిశ్రమంలా ఉన్నట్టనిపిస్తే అది కవి నేలను విడిచి నింగికెగసిన ఉచ్చస్థితినే సూచిస్తుంది. దేన్నైనా కాస్త ఎత్తు నుంచీ చూడడం పరిణతికి నిదర్శనం. ‘ఒక సూది మనిద్దరినీ దేహ భాష బంధాలతో కలిపి కుడుతోంది’ వంటి మాంస రక్తాలను (flesh & blood) తట్టితడిపే సంవేదనలూ, ‘కన్నీళ్ళని ఉడికించి శరీరానికి తాపాలి ‘వంటి ప్రాయశ్చిత్తపు నిర్ణయాలూ కనిపించినా ఈ సంపుటి అంతిమ లక్ష్యం దేహాన్ని జ్ఞాపకం పెట్టుకోవడమో కన్నీళ్ళని ఒక హద్దు మించి glamorize చెయ్యడమో కాదు. రాత్రించరుల నిద్ర ఎప్పుడా అన్నది ఈ సంపుటిని వెంటాడే ప్రధానాంశం (theme).
గాలి పంచభూతాల్లో ఒకటి. ప్రసరణ వాయువు సహజ గుణం. అద్దం కేవలం కాంతిని ప్రతిఫలించే సాధనం. ప్రాచీన సమాజాల్లో అద్దానికి spiritual విలువ కూడా ఉండేదనీ అది వస్తువులనే కాక ఆత్మనూ ప్రతిబింబిస్తుందనీ ఒక పక్క, అద్దం ఏవో కొత్త లోకాలకు గడప వంటిదనే మాయాన్వితమైన (magical) నమ్మకం మరో పక్క ప్రజల్లో ఉండేదనీ చరిత్ర చెబుతోంది. ఎం.ఎస్.నాయుడికి ఈ రెండూ అంటే అంత పట్టింపెందుకు? గాలి అద్దం పూర్తి కవిత చూడండి.
గాలిఅద్దం
ఒకానొక అతడి సాయంత్రంలో
అతడ్ని సూర్యుడు వెంబడించాడు
ఒకానొక అతడ్ని వెంబడించే
సూర్యుడు సాయంత్రమయాడు
ఎవరికో చెందిన అతడు
సాయంత్రాన్నీ సూర్యుడ్నీ
కలిపి కుట్టలేక ఒకానొక
అద్దంలో నిష్క్రమించాడు
ఎవరికీ చెందని అతడు
సూర్యుడి సాయంత్రాన్ని వెంబడిస్తుంటే
ఎప్పటికీ లేని రాత్రేదో భూమిలో తిరుగుతోంది
అతడు తిరిగిన భూమి ఎవరిదో
ఎవరి రాత్రిలో అతడున్నాడో
ఒకానొక అద్దమైనా చెప్పదు
ఎవరికీ ఏదీ చెప్పని ఒకానొక రాత్రి
అతడ్ని వెంబడించేలోగా
గాలి అద్దం వచ్చి గట్టిగా ఊపిరి
పీల్చుకుంటోంది
ఎవరికీ చెందని ఒకానొకగాలే
అతడ్నీ వెంబడిస్తోంది
చిట్టచివరి నీడ కోసం
పుస్తకానికి శీర్షిక అయిన ఈ కవితని సంపుటిలోని చివరాఖర్న ఉంచడం యాదృచ్ఛికం కాదు. పై కవితలో అన్నీ అనిర్దిష్టాలు. పదే పదే ‘ఒకానొక’ అంటూ ప్రతి వస్తువునూ ప్రతీకనూ విశేషించడం వల్ల అన్నిటికీ ఉనికి సన్నగిల్లి, చిట్టచివరి నీడ అన్ని వెంబడింపులకూ గమ్యమౌతోంది. ఇది మృత్యు స్పృహ. మృతుచ్ఛాయ కోసమే అద్దంలోకి నిష్క్రమించడం జరుగుతోంది. జీవికీ, కవికీ కైవల్యమే అంతిమ పదం. ఆధునిక కవుల్లో ఈ కైవల్య సాధనకు మృత్యు స్పృహ తొలి సాధనం. ‘ఆకర్షించే అవలక్షణాలేనా ఉనికి ‘అనడం రెండో మెట్టు. ‘ఎన్నిసార్లు నిద్రించాలి ఒక ఆఖరు రాత్రిలో ‘అన్నది మొదలుకొని చివరిదాకా ఆ నీడలోనే ఆస్పృహతోనే ఉన్నాడు నాయుడు. ఈ సంపుటిలోని కవితా ఖండికలైతే చాలా ఉన్నాయి గానీ ఇవన్నీ ఒకే ఒక్క కవితకు అనేక రూపశకలాలు. ఆశకలాల్ని తవ్వి తీసి పరికిస్తే తేలేదింతే. ‘మరోసారి చనిపోయే క్షణాల్లోకి ఒంటరిగా నడుద్దాం’ అని ధైర్యంగా చాటుతాడు. ‘ఒక చిన్న రాత్రి చాలు/ వేల జ్ఞాపకాలు ఒక వాక్యమవటానికి ‘అనే స్పృహ కలిగినప్పటికీ, ‘మళ్ళీ బతుకుతాను ఈ రాత్రిలో ‘అని లేచొచ్చి, ‘గాలిని నిద్రలోకి నన్ను తీసుకెళ్ళు ‘అని బతిమాలుకొని ‘తెరవని అద్దంలోకి చెరిసగం విడిపోదాం’ అని తోడు కోరుకుంటాడు, ఆ అద్దం వెనకున్న ఏ మాంత్రిక లోకాల్లోనో ఒంటరి అయిపోకుండా ఉండేందుకు. అయితే ఒంటరితనం గురించి రాశాడా అంటే అసలేం రాశాడు నాయుడు? రాయడమంటే తిరగరాయడమని తెలుసు నాయుడికి. ‘దాటాలి పదాలలోంచీ ‘అనీ, ‘వాక్యాన్నే నిషేధించాను ఈ అనిశ్చిత అక్షరాల్లో ‘అనీ అంటాడు.
పదాలు భావార్థ వాహికలుగా కన్నా అడ్డంకిగా కవికి తోచాయి. ‘ఇక్కడెక్కడో చిట్లిన వాక్యం చివర్న అక్షరం ఎక్కడైనా ఎప్పుడైనా ప్రారంభమౌతుందా ‘అని ఆశపడతాడు. ‘మాటల్లోని మాట్లాడని మాటలూ పాతవే’ అన్న నిరుత్సాహం ముంచుకొచ్చి ‘ప్రతి అనుభవం ఓ ఖాళీ ప్రతిధ్వని’ అని ‘మౌనంలోకి బిగ్గరగా అరవాలి’ అనే నిశ్చయానికొస్తాడు. ఇవేకాక, ఇందులో జ్ఞానేంద్రియాలన్నీ పోటీపడి కలగాపులగమయ్యాయా అనిపించే వాక్యాలనేకం. సరే, జ్ఞానేంద్రియాలు కలగాపులగమవవు గానీ ఇందుకు కారణం తపస్సమాధిలో ఉన్న కవిని ప్రపంచం కళవెళ పెట్టి తపోభంగాన్ని కలిగించడమే అని చెప్పవచ్చు.
ఇంత చక్కగా ఇన్నీ మన కోసం రాసిచ్చిన నాయుడిని అభినందిస్తూ, ఇంకా త్వరలోనే రాబోతున్న తన మూడో కవితా సంపుటిని (‘Abstract Pronoun’) ఆహ్వానిస్తున్నాను. ఏకాకిగా కవిత్వ తపస్సు చేస్తున్న ఈ ఒంటరికి, ఎం.ఎస్.నాయుడికేం దొరికిందంటే, ఎం.ఎస్.నాయుడి వంటి వారి కోసమే ఒక వేదర్షి కొన్ని ఋక్కులు రాశాడు.
యోజాగా రతమృచః కామయన్తే
యోజాగారతము సామానియంతి
యోజాగా రతమయం సోమ
ఆహతవాహమస్మిసఖ్యేన్యోకాః
(ఋగ్వేదం, 5.44.14)
[Who stays awake, him the verses desire. Who stays awake, to him go the melodies. Who stays awake, to him does this Soma say : ‘I am at home in fellowship with you.’ – Tr. Brereton & Jamison] ఎం.ఎస్.నాయుడికి, వేదర్షులు కొలిచిన అగ్ని వలే రాత్రి మేల్కొంచి ఉన్న నాయుడికి ఈ ఋక్కు చెందుతుందనీ, ఈ ఋక్కు ఎం. ఎస్.నాయుడికి చాలుననీ నేను నమ్ముతున్నాను.
వాసు