Wednesday, January 22, 2025

అరంగేట్రంతోనే రికార్డు తారక..

- Advertisement -
- Advertisement -

మహా నటుడు నందమూరి తారకరామారావు మనవడుగా నందమూరి వంశాంకురంగా తారకరత్న కేవలం పందొమ్మిదేళ్ళకే కెమెరా ముందుకు వచ్చారు. అది 2002 సంవత్సరం. బాబాయ్ బాలకృష్ణ అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. ఆ బాబాయ్‌కి ముద్దుల అబ్బాయ్‌గా ఉన్న తారకరత్న తాను హీరో అవుతానని కోరిక బయటపెట్టాడు. అంతే బాలయ్య ప్రోత్సాహంతో మొత్తం నందమూరి ఫ్యామిలీ మద్దతుతో నటుడిగా అరంగేట్రం చేశాడు తారకరత్న.

సినీ రంగ ప్రవేశంతోనే రికార్డు…
ఒకేసారి తొమ్మిది సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారకరత్న. ఇది అప్పటికీ ఇప్పటికీ కూడా రికార్డు. ఏ హీరో అయినా తొలి సినిమా తరువాతనే ఒకటో, రెండో సినిమాలు ప్రారంభిస్తారు. కానీ తారకరత్న మాత్రం తొమ్మిది మూవీస్‌తో నందమూరి వంశం మూడవ తరంలో హీరోగా దూసుకువచ్చాడు. ఒక కొత్త హీరో ఏకంగా తొమ్మిది చిత్రాలతో పరిచయం కావడం సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని సంఘటన. మహానటుడు ఎన్టీఆర్ మనవడు, ఛాయాగ్రాహకుడు నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్నను అంత గ్రాండ్‌గా పరిచయం చేసింది నందమూరి కుటుంబం. 2002లో జరిగిన ఈ చారిత్రక సంఘటనకు వేదికగా నిలిచింది హైదరాబాద్‌లోని రామకృష్ణా స్టూడియో ప్రాంగణం. ఆ రోజు తొమ్మిది సినిమాలు మొదలైనా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన ఏకైక చిత్రం ‘ఒకటో నంబర్ కుర్రాడు’. ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ నిర్మాతలు కావడం విశేషం. 2002లో విడుదలైన ఈ సినిమాకు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

అనుకున్నంతగా కొనసాగలేక…
తారకరత్న దూకుడు చూసిన వారు అంతా స్టార్ హీరో అవుతాడని దశాబ్దాల పాటు వెండితెరను ఏలతాడని అంతా భావించారు. ఒకటవ నంబర్ కుర్రాడు సినిమా అయితే మ్యూజికల్ హిట్. పాటలు అన్నీ బాగుంటాయి. తారకరత్న తొలి సినిమా అయినా పాటలలో బాగానే చేశాడని పేరు తెచ్చుకున్నాడు. ఇక నెమ్మదిగా ఆయన స్థిరపడతాడు అనుకున్నారు కానీ మంచి కధలు రాకపోవడం, అప్పటికే ఎక్కువ మంది యంగ్ హీరోలు ఉండడంతో ఒక రకమైన పోటీ ఏర్పడింది. ఇక తారకరత్న చేసిన సినిమాలలో కొన్ని యావరేజ్ రిజల్ట్ ని ఇవ్వడంతో అంగరంగ వైభవంగా మొదలైన ఆయన సినీ ప్రస్థానం కొన్నాళ్ళకే డీలా పడినట్లు అయింది. ఒక విధంగా గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఈ నందమూరి కుర్రాడు మంచి మర్యాదలలో చక్కని వ్యక్తిత్వంలో ఒకటో నంబర్ కుర్రాడే. ఆరడగుల పొడుగు కొనదేరిన ముక్కు, అందంతో పాటు అన్నీ ఉన్నాయి. కానీ అదృష్టం కలసిరాలేదు. అందుకే ఆయన సినీ కెరీర్ నత్తనడకగా సాగింది.

తారకరత్న మొత్తం 21 చిత్రాల్లో ఆయన నటించారు. వీటిల్లో యువరత్న, భద్రాద్రి రాముడు, నందీశ్వరుడు చిత్రాలు తారకరత్నకు నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టాయి. 9 అవర్స్ వెబ్ సిరీస్‌లో తారకరత్న చివరి సారిగా నటించారు. ఇక అమరావతి, రాజా చెయ్యి వేస్తే చిత్రాల్లో విలన్‌గా ఆయన నటించారు. ‘అమరావతి’ చిత్రంతో నంది అవార్డు కూడా అందుకొన్నారు. విలన్‌గా కూడా ఆయన ప్రయాణం ఆశించిన విధంగా సాగలేదు. నటుడిగా రాణిస్తూనే రాజకీయాల వైపు కూడా ఆసక్తిని చూపించారు. 2009లో తన వంతుగా తెలుగుదేశానికి ప్రచారం చేసి పెట్టిన తారకరత్న ఇటీవల అమరావతి టూ అరసవెల్లి కి రైతులు పాదయాత్ర చేస్తే వారికి మద్దతుగా కొంతదూరం నడచి సంఘీభావం తెలిపారు.

ప్రేమ వివాహం…
నందమూరి వంశంలో తొలి సారిగా ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి తారకరత్న. తన స్నేహితురాలు అలేఖ్యా రెడ్డిని ఆయన 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. అలేఖ్యా రెడ్డికి అప్పటికే పెళ్లయింది. కానీ విడాకులు తీసుకున్నారు. ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు ఆమె కాస్టూమ్స డిజైనర్‌గా చేశారు. తారకరత్న ప్రేమ వివాహంతో ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ని కొంత కాలం దూరం పెట్టినా తర్వాత కలసి పోయారు. ఈ దంపతుల ఏకైక కుమార్తె నిష్క.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News