Sunday, December 22, 2024

ఆందోళనకరంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..

- Advertisement -
- Advertisement -

ఆందోళనకరంగా తారకరత్న ఆరోగ్యపరిస్థితి
కొనసాగుతోన్న అత్యవసర చికిత్స
బెంగళూర్ తరలిన నందమూరి కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు
హైదరాబాద్: టిడిపి యువగళం పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో రక్తాన్ని పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రన్ ఆక్సిజన్ (ఎక్మో) పరికరం ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి వైద్యులు తారకరత్న ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసి, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెల్లడించారు. దీంతో నందమూరి అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది.

శుక్రవారం నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే ఉంటూ తారకరత్నకు అందుతోన్న చికిత్సతో పాటు కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఆసుపత్రిలో బాలకృష్ణతో పాటు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఆయన తల్లి శాంతి, తండ్రి మోహన్ కృష్ణ ఉన్నారు. ఈ క్రమంలో హృదయాలయ ఆసుపత్రికి నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాషిని, టిడిపి నేతలు దేవినేని ఉమ, నిమ్మకాయ చినరాజప్ప, పరిచాల శ్రీరామ్‌లు ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

Taraka Ratna Health Condition Critical

తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హృదయాల ఆసుపత్రి వైద్యులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. మైరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన్ కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. తారకరత్నకు అందుతున్న వైద్యంపై చంద్రబాబుకు నందమూరి బాలకృ-ష్ణ వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. తారకరత్న ఆరోగ్యాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారని, రక్తప్రసరణలో ఇంకా గ్యాప్‌లు వస్తున్నాయని అన్నారు. వైద్యులు ఏ చికిత్స చేయాలో నిర్ణయించి, ఆ దిశగా ముందుకుపోతామని చంద్రబాబు తెలిపారు.

మరోసారి పరీక్షలు: పురంధేశ్వరి
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నామని, సోమవారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె వెల్లడించారు. ఇదిలావుండగా తన సోదరుడు కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధించినట్లు నటుడు కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News