Thursday, December 26, 2024

బుల్డోజర్ న్యాయంపై ధర్మాగ్రహం

- Advertisement -
- Advertisement -

నేరారోపణలకు గురైన వ్యక్తుల ఆస్తులను కూల్చివేసే ‘బుల్డోజర్ న్యాయం’ చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విధానాన్ని అత్యున్నత న్యాయ ధర్మాసనం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ముస్లింల ఆస్తులను లక్షంగా చేసుకుని ధ్వంసం చేయడం పాలనా విధానంలో ఒక భాగమైపోయిందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. బుల్డోజర్ న్యాయాన్ని నిలదీస్తూ ఇటీవల పిటిషన్ దాఖలైన సందర్భంగా సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. నేరం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి ఆస్తుల్ని ధ్వంసం చేయడం కోసం రాజకీయంగా పాలకులు బుల్డోజర్‌ను ఉపయోగించడం ఎంతవరకు సబబు అని నిలదీసింది. ఈ విషయంలో న్యాయస్థానం నిర్లక్షంగా వ్యవహరించబోదని పేర్కొంది. ఆ నిర్మాణాలు అక్రమమని తేలినప్పుడు ముందుగా నోటీసులు ఇవ్వాలని, వాళ్లు స్పందించకపోతే చర్యలు తీసుకోవాలని సూచించింది.

నిర్మాణాలను కూల్చడం సమర్థించుకోడానికి కొన్ని కేసుల్లో పాత తేదీలతో నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలాంటి చట్టానికి అతీతంగా బుల్డోజర్ న్యాయం సాగకుండా కచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. బుల్డోజర్ జస్టిస్‌కు దారి తీసే సంఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, మహారాష్ట్రల్లో ఇళ్లు, దుకాణాలు కూడా ఈ విధంగా బుల్డోజర్ న్యాయానికి బలవుతున్నాయి. ఒక వ్యక్తిపై ఆరోపణలు రుజువు కాకముందే ఈ విధంగా అతని ఆస్తులను ఎలా ధ్వంసం చేస్తారని, ఒకరి నేరానికి కుటుంబం మొత్తాన్ని ఎందుకు శిక్షించాలన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ విద్యార్థి తోటి విద్యార్థిని కత్తితో పొడిచాడు.

వెంటనే అధికారులు ఆ నిందితుడి ఇల్లు కూల్చివేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొడుకు తప్పు చేస్తే తండ్రి కట్టుకున్న ఇల్లు కూల్చేయడమేమిటి? అన్న అభ్యంతరం తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2017 సెప్టెంబర్‌లో యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తరువాత నేరాలకు పాల్పడేవారి ఇళ్లను కూల్చేస్తామని హెచ్చరించారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు ముఖ్తారీ అన్సారీ ఆస్తులను ధ్వంసం చేయించారు. బుల్డోజర్ బాబా అన్న పేరు కూడా యోగి ఆదిత్యనాథ్ సంపాదించుకున్నారు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తన ప్రచారంలో ‘బుల్డోజర్ న్యాయం’ ప్రధాన నినాదంగా వాడుకోవడం విశేషం. 2022 ఎన్నికల్లో బిజెపి రెండోసారి విజయం సాధించినప్పుడు కార్యకర్తలు బుల్డోజర్‌తో పార్టీ విజయాన్ని జరుపుకున్నారు.

అదే సంవత్సరం బిజెపి నాయకురాలు నూపుర్‌శర్మ మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ముస్లింల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో యుపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు చేపట్టింది. ఈ బుల్డోజర్ న్యాయం కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాలేదు. 2022లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మత ఘర్షణల తరువాత ఖార్గోన్‌లోని ఇళ్లు, దుకాణాలు కూల్చి వేయించారు. దీంతో ఆయన ‘బుల్డోజర్ మామ’గా మారిపోయారు. 2022 ఏప్రిల్‌లో వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో మత ఘర్షణల తరువాత మసీదు గేటుతోసహా అనేక నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఇవన్నీ అక్రమ నిర్మాణాలే అని వీటిని కూల్చడం క్రమబద్ధమైన న్యాయం అని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే సిపిఎం నాయకురాలు బృందాకారత్ ఆ డ్రైవ్ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు.

ఈ ఏడాది జనవరిలో ముంబైలోని మీరా రోడ్ సబర్బ్‌లో మతఘర్షణల తరువాత రెండు రోజులకు సంబంధిత ఆస్తులను ధ్వంసం చేయించారు. హర్యానాలోని సుహ్‌లో మతపరమైన హింస చెలరేగి ఆరుగురు హత్యకు గురికాగా, అప్పటి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వం అనేక గృహాలను, దుకాణాలను కూల్చి వేయించింది. ఒకవ్యక్తి మతహింస లేదా అల్లర్లలో పాల్గొన్నారని లేదా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డాడని అతని ఇంటిని కూల్చివేయలేమని జస్టిస్ మదన్ బి లోకూర్ వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండా, ప్రొసీడింగ్‌లను రూపొందించడం ద్వారా ఏదైనా ఇంటిని కూల్చివేయడం, ఆ కూల్చివేతలను పత్రికల్లో ప్రచారం చేయడం పాలకులకు ఫ్యాషన్‌గా మారిందని మధ్యప్రదేశ్ హైకోర్టు గత ఫిబ్రవరిలో వ్యాఖ్యానించింది. రాజ్యాం గంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇళ్లను కూల్చివేయడం జీవించే హక్కును ఉల్లంఘిస్తుందని, కూల్చివేసిన ఇళ్లకు బదులు ఇళ్ల పునర్నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీం కోర్టులో ఇటీవల వాదించారు. ఈ అంశాలన్నీ మరోసారి సమీక్షించవలసి ఉందని న్యాయవాదులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News