Sunday, January 19, 2025

కేన్సర్ పై గోలీమార్: మందు కనిపెట్టిన టాటా ఇన్ స్టిట్యూట్!

- Advertisement -
- Advertisement -

ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రధాన రోగాల్లో కాన్సర్ ఒకటి. ఏటా లక్షలమందిని కబళిస్తున్న ఈ మహమ్మారి వ్యాధి నిరోధానికి ఇప్పటివరకూ సరైన మందు లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ప్రయోగదశలో ఉన్నాయి. కాగా కాన్సర్ పరిశోధనలో అందె వేసిన చేయిగా పేరొందిన ముంబయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ కేన్సర్ వ్యాధికి మందు కనిపెట్టింది. ఈ మాత్ర ధర వంద రూపాయలు మాత్రమే కావడం విశేషం. ప్రస్తుతం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

కేన్సర్ వ్యాధికి గురైన వ్యక్తులలో కొందరికి వ్యాధి తగ్గినా, మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. ఇలా కేన్సర్ తిరగబెట్టడాన్ని ఈ మందు అరికడుతుంది. రోగగ్రస్తులు రేడియోథెరపీ, కీమోథెరపీ చేయించుకున్నప్పుడు లోనయ్యే దుష్ప్రభావాలను కూడా ఈ మందు నివారిస్తుంది. టాటా మెమోరియన్ ఆస్పత్రిలో సీనియర్ కేన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బాద్వే ఒక ప్రముఖ టీవీ చానెల్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించారు. టాటా ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు మొదట ఎలుకలపై ప్రయోగాలు చేసి పురోగతి సాధించారు. ఎలుకల్లో కేన్సర్ కణాలను ప్రవేశపెట్టి, కేన్సర్ కణుతులు ఏర్పడేవరకూ వేచి చూశారు. తర్వాత వాటికి రేడియోథెరపీ, కీమోథెరపీ చేసిన అనంతరం, శస్త్రచికిత్స నిర్వహించి కణుతులను తొలగించారు. అయితే కేన్సర్ కణాలు క్రోమాటిన్ రేణువులుగా విడిపోయి, రక్తప్రవాహంలో కలసి, ఆరోగ్యవంతమైన కణాలను కూడా కేన్సర్ కణాలుగా మార్చివేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

దీన్ని నివారించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలకు రెస్వేరట్రాల్, కాపర్ (ఆర్+సియు) కలసి ఉన్న ప్రో ఆక్సిడెంట్ టాబ్లెట్లను ఇచ్చారు. ఈ టాబ్లెట్లు ఆక్సిజన్ రేణువులను ఉత్పత్తి చేశాయి. ఈ రేణువులు క్రోమాటిన్ రేణువులను విచ్ఛిన్నం  చేశాయి. టాటా ఇన్ స్టిట్యూట్ తయారుచేసిన టాబ్లెట్లను నోటి ద్వారా తీసుకుంటే ఉదరంలో ఆక్సిజన్ రేణువులు ఉత్పత్తి అయి, క్షణాల్లో రక్తంతో కలిసిపోయి, కేన్సర్ కణాలు ఏర్పడకుండా అరికడతాయి.

తాము తయారు చేసిన టాబ్లెట్లు కేన్సర్ చికిత్స కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలను 50 శాతం వరకూ, కేన్సర్ తిరగబెట్టకుండా 30శాతంవరకూ నిరోధిస్తాయని డాక్టర్ రాజేంద్ర చెప్పారు. ప్రస్తుతం ఈ టాబ్లెట్ల వాడకానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అనుమతి కోసం వేచి చూస్తున్నారు. అనుమతి లభించిన పక్షంలో ఈ టాబ్లెట్లు జూన్ లేదా జూలై నాటికి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News