హైదరాబాద్: ఉద్యోగం చేస్తూనే.. సమాజ హితం కోసం. పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న మాచన రఘునందన్ ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని టాటా మెమోరియల్ సెంటర్ (టీ ఎమ్ సి) పేర్కొంది. క్యాన్సర్ పరిశోధనలో ముంబయికి చెందిన టాటా స్మృతి కేంద్రం విశేష కృషి చేస్తోంది.
ఇందులో భాగంగా..పొగాకు నియంత్రణ, ప్రజా ఆరోగ్యం, క్యాన్సర్ పరిశోధన రంగాల్లో చేస్తున్న కృషి కి అవార్డులను ప్రకటించింది. ఈ కోవలోనే హైదరాబాద్ కు చెందిన మాచన రఘునందన్ తన 22 ఏళ్ల పొగాకు నియంత్రణ కృషి తాలూకు వివరాలను టిఎమ్ సికి సమర్పించారు. పౌర సరఫరాల శాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తూనే..22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు “మాచన” చేస్తున్న అసాధారణ కృషి ని టిఎమ్ సి అభినందించింది. వెల్ డన్.. రఘునందన్ అంటూ ప్రశంసించింది.
కాగా..క్యాన్సర్ పరిశోధనకు కృషి చేస్తున్న వారికి మాత్రమే అవార్డులను అందజేస్తారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి, ప్రవృత్తి గా సమాజ హితం కోసం పాటుపడటం, రెండు దశాబ్దాలుగా పొగాకు నియంత్రణ కోసం నిర్విరామ కృషి చేయడం శ్లాఘనీయం అని టిఎమ్ సి కొనియాడింది. మాచన రఘునందన్ కృషి ప్రేరణ కలిగించే విధంగా ఉందని పేర్కొంటూ..త్వరలో పొగాకు నియంత్రణ అవార్డు ను అందజేయనున్నట్టు టిఎమ్ సి ఫోన్ ద్వారా సమాచారం అందించిందని మాచన రఘునందన్ తెలిపారు.