క్యూ2లో కంపెనీ లాభం రూ.12,547 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగిన లాభం
న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో టాటా స్టీల్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.12,548 కోట్లతో ఎనిమిది రెట్లు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.1,665 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ.38,249 కోట్ల నుంచి రూ.59,394 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ప్రతిపాదికన నికర లాభం రూ.9,768 (క్యూ1)తో పోలిస్తే 28 శాతం జంప్ చేసింది. అదే సమయంలో విక్రయాలు రూ.52,574 కోట్లతో 13 శాతం పెరిగాయి. ఎబిటా రూ.17,810 కోట్లతో ఎనిమిది రెట్లు పెరిగింది. మాతృ సంస్థ టాటా స్టీల్‌తో టాటా స్టీల్ బిఎస్‌ఎల్ విలీనానికి ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లకు 15 టిఎస్‌బిఎస్‌ఎల్ షేర్లకు గాను ఒక షేరును కంపెనీ జారీ చేసింది.
క్యూ2లో పెరిగిన జొమాటో నష్టం
సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసికంలో జొమాటో నికర నష్టం రూ.434.9 కోట్లకు పెరిగింది. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో పెట్టుబడుల కారణంగా కంపెనీ నష్టాలు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.229.8 కోట్లుగా ఉంది. అయితే సంస్థ ఆదాయం రూ. 426 కోట్ల నుంచి రూ.1,024.2 కోట్లకు పెరిగింది. డెలివరీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెట్టిన పెట్టుబడులే నష్టాలకు కారణమని జొమాటో వ్యవస్థాపకుడు, సిఇఒ దీపిందర్ గోయల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) అక్షత్ గోయల్ ఒక లేఖలో తెలిపారు. ఫలితాల నేపథ్యంలో మార్కెట్లో జొమాటో షేరు విలువ 4 శాతం పెరిగి రూ.142కు చేరింది.
ఈజీమైట్రిప్ 50 శాతం డివిడెండ్
ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ ఈజీమైట్రిప్ రూ.2 ముఖ విలువ కల్గిన ఈక్విటీ షేరుకు రూ.1 (50%) చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. మొత్తం రూ.10.86 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ చెల్లిస్తోంది. మార్చిలో లిస్టయిన తర్వాత కంపెనీకి ఇది రెండో డివిడెండ్ అవుతుంది. ఏప్రిల్‌లో కంపెనీ రూ.2 చొప్పు డివిడెండ్ ఇచ్చింది. ఎయిర్‌లైన్ టికెట్లు, హోటల్ బుకింగ్ సేల్స్ భారీగా ఉండడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.27.13 కోట్లు నమోదైంది. ఆదాయం రూ.22.29 కోట్ల నుంచి రూ.59.78 కోట్లకు పెరిగింది.