న్యూఢిల్లీ : టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 22 న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. ఇది ఈ నెల 24న ఆఫర్ ముగుస్తుంది. ఈ ఐపిఒ పూర్తి ఆఫర్ ఫర్ సేల్(ఒఎఫ్‌ఎస్) అవుతుంది, దీని కోసం కంపెనీ 6.08 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థనే ఈ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్, అయితే దాదాపు 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ ఐపిఒతో వస్తోంది. 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఐపిఒ వచ్చింది.
ఆ తర్వాత ఈ గ్రూప్ నుంచి ఐపిఒ రావడం ఇదే. నాలుగు నెలల క్రితం ఐపిఒ ద్వారా నిధులను సేకరించేందుకు కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (సెబీ) ఆమోదం తెలిపింది. ఈ కొత్త కంపెనీ షేర్లు డిసెంబర్ 5న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో లిస్ట్ కానున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపిఒ కోసం నవంబర్ 24 వరకు వేలం వేయవచ్చు. కంపెనీ షేర్లు డిసెంబర్ 5న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో లిస్ట్ కానున్నాయి. కంపెనీ టాటా టెక్నాలజీస్ ఐపిఒ ధర శ్రేణిని త్వరలో విడుదల చేయనుంది.
కంపెనీ ఐపిఒలో 50 శాతం వాటా క్వాలిఫైడ్ ఇన్‌స్ట్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబి) కోసం రిజర్వ్ చేశారు. ఇది కాకుండా 35% వాటా రిటైల్ పెట్టుబడిదారులకు, మిగిలిన 15 శాతం వాటా నాన్- ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్‌ఐఐ) రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఒక గ్లోబల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్వీసెస్ కంపెనీ, ఇది గ్లోబల్ ఒరిజినల్ పరికరాల తయారీదారులు (ఒఇఎంలు), వారి టైర్-1 సరఫరాదారులకు ఉత్పత్తి అభివృద్ధి, టర్న్‌కీ పరిష్కారాలను అందిస్తుంది. టాటా టెక్నాలజీస్- కెపిఐటి టెక్నాలజీస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ సర్వీసెస్, టాటా ఎలక్సీ వంటి లిస్టెడ్ కంపెనీలతో పోటీపడనుంది.
11,081 మంది ఉద్యోగులు
టాటా టెక్నాలజీస్ సిఇఒగా వారెన్ హారిస్ ఉన్నారు. కంపెనీలో మొత్తం 11,081 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కంపెనీకి ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా -పసిఫిక్‌లలో 18 గ్లోబల్ డెలివరీ కేంద్రాలు ఉన్నాయి, వీటిలో భారతదేశంలో పుణె (ప్రధాన కార్యాలయం), గుర్గావ్, బెంగళూరు, థానే, చెన్నై ఉన్నాయి. టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్ మొత్తం 74.69 శాతం వాటాను కలిగి ఉంది. ఆల్ఫా టిసి హోల్డింగ్స్ 7.26 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్- 3.63 శాతం వాటాను కలిగి ఉన్నాయి.