Tuesday, December 24, 2024

టాటా, బిర్లాలకు దీటుగా తాతలనాటి కులవృత్తులతో హాయిగా బతకాలి : మంత్రి కెటిఆర్ 

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: టాటా, బిర్లాలకు దీటుగా తాతలనాటి కులవృత్తులతో బతకాలని, మన కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకున్ని కాపాడుకోవాలని ఐటి పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహన్ని టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి కెటిఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. మానేరు నదిలో పర్యాటక శాఖవారు ఏర్పాటు చేసిన నూతన బోటును, కె కన్వెన్షన్ సెంటర్‌ను, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 40 కెవి రూప్ టాప్ సోలార్ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్, డేకేర్, ఖిమోథెరపి సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు.

మహాత్మాగాంధీ, కొండా లక్ష్మణ్ బాపూజీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి నాయకులు ఒక కులం, వర్గానికి పరిమితం కాదని వారు జాతీయ నాయకులని మంత్రి కెటిఆర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మగౌరవం కోసం పదిమందితో పోరాటం ప్రారంభించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేశారని, అదే క్రమంలో సిఎం కెసిఆర్ కూడా తెలంగాణ ఉద్యమం పదిమందితో ప్రారంభించి తెలంగాణ సాధించి గోల్కొండపై జెండా ఎగుర వేశారన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే తాము వేదికలపై కూర్చునే స్థాయి పదవులు పొందామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పేదలందరిని కడుపులో పెట్టుకుని తెలంగాణలోని 4కోట్ల మంది ప్రజలకు న్యాయం చేస్తున్నారన్నారు. అన్ని కులవృత్తులకు న్యాయం చేయడమే తమ లక్షమన్నారు. గౌడన్నలకు సేఫ్టీ మోకులు రాష్ట్రంలో మొదట సిరిసిల్లలోనే అందిస్తామని, అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములుంటే గౌడ సంఘాలకు అందిస్తామన్నారు. టాటా, బిర్లాలకు దీటుగా తాతలనాటి కులవృత్తులతో హాయిగా బతకాలని, పనిచేసే, పనికొచ్చే నాయకున్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు.

ఎవరో వచ్చి ఏదో చెప్పితే నమ్మి మోసపోవద్దని ఆగం కావద్దని అన్నారు. సిరిసిల్ల మధ్య మానేరులో టూరిజం శాఖ బోట్‌ను ప్రారంభించామని త్వరలోనే సినిమా షూటింగ్‌లు సిరిసిల్లలో జరుగుతాయన్నారు. సిరిసిల్ల మధ్య మానేరు ప్రాంతం పాపికొండలు, కోనసీమ అందాలను తలదన్నేలా తయారైందన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను వచ్చే నెలలో సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారని దాని వల్ల వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని అన్ని చెరువులు, కుంటలు 365 రోజులు సిఎం కెసిఆర్ తెచ్చిన గోదావరి జలాలతో నిండుకుండల్లా ఉండేలా చూస్తామన్నారు. కొందరు కుల వృత్తులే చేస్తూ వీరు జీవించాలా అని ప్రశ్నిస్తున్నారని అందుకే వెయ్యిన్నొక గురుకుల పాఠశాలలు ప్రారంభించి ప్రతి విద్యార్థిపై రూ.లు 1.25 లక్షలు వెచ్చించి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నామన్నారు. విదేశీ చదువులకు వెళ్లేవారికి రూ.లు 20 లక్షలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని మంత్రి కెటిఆర్ వివరించారు.

గౌడన్నల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని నీరా కేఫ్‌లు కూడా జిల్లాలకు ఆ తరువాత మండలాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మరో 20 యేళ్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే… ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మరో 20 సంవత్సరాలపాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుల మతాలకు అతీతంగా సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అభివృధ్ది పనులు చేస్తున్నారన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు, గీతన్నలకు విడదీయలేని అవినాభావ సంబంధం ఉందన్నారు. గత ప్రభుత్వాలు నేతన్నలు, గీతన్నలు మరణిస్తే వారిని ఆదుకోలేదన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కొబ్బరి చెట్లునష్టపోతే పరిహారం అందించారే తప్ప తెలంగాణలో మనుషులు మరణించినా పరిహారం ఇవ్వలేదని, మనుఫులకు కనీసం చెట్లతో సమానమైన విలువ ఇవ్వలేదన్నారు.

స్వరాష్ట్రంలో అన్ని కులవృత్తులకు సమాన ప్రాధాన్యత లభిస్తోందన్నారు. కుల వృత్తులకు పూర్వవైభవం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో బెంజి కార్లలో వచ్చి నీరా తాగేలా నీరా కేఫ్‌లు ఏర్పాటు చేశామన్నారు. వైన్స్‌లో గౌడ్స్‌కు 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, 70 వేలమంది గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారన్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు ఇచ్చి వాటిలో భవన నిర్మాణానికి కోట్లాది రూపాయలు అందించారన్నారు. త్వరలోనే మూడు కోట్ల రూపాయలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రానున్న మూడేళ్లలో సిరిసిల్లలో సినిమాలు తీస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపెల్లి వినోద్‌కుమార్, టెక్స్‌టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, జిల్ల గౌడ సంఘం అధ్యక్షుడు చిదురు గోవర్ధన్ గౌడ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మాజీ ఎంఎల్‌ఏ కోడూరి సత్యనారాయణ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి,సిరిసిల్ల పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర నారాయణ గౌడ్,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News