Saturday, November 23, 2024

గుజరాత్‌లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -


గుజరాత్‌లో ‘తౌక్టే’ విధ్వంసం.. ఏడుగురు మృతి
వేల సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన ఇళ్లు, రోడ్లు

అహ్మదాబాద్: దేశ పశ్చిమ తీరాన్ని వణికించిన తౌక్టే పెనుతుపాను బలహీన పడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్‌లొని పౌరాష్ట్ర తీరాన్ని తాకిన తుపాను ఆ తర్వాత బలహీన పడి పెను తుపానుగా మారినట్లు భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా సౌరాష్ట్ర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, అది మధ్యాహ్నానికి క్రమంగా మరింత బలహీన పడి తుపానుగా మారవచ్చని ఐఎండి ఉదయం 10.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది, అయితే తుపాను ప్రభావంతో గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరాన్ని దాటే క్రమంలో తౌక్టే రాష్ట్రంలో బారీ విధ్వంసాన్నే సృష్టించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. వందలాది ఇళ్లు, రోడ్లు ధ్వసమైనాయి. తుపాను ధాటికి కనీసం 7 మంది చనిపోయినట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చెప్పారు.16,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని, 40 వేలకు పైగా చెట్లు,1000కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఆయన చెప్పారు. భావ్‌నగర్ జిల్లాలో ముగ్గరు చనిపోగా, రాజ్‌కోట్, పటాన్, అమ్రేలి, వల్సాడ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పటాన్ పట్టణంలో సోమవారం రాత్రి నిద్రిస్తున్న మహిళపై విద్యుత్ స్తంభం పడి ఆమె చనిపోయింది. భావ్‌నగర్ జిల్లా బడేలి గ్రామంలో ఇల్లు కూలి తల్లీ కూతుళ్లు మృతి చెందారు. అలాగే అమ్రేలి జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒక బాలిక చనిపోగా,ముగ్గురు గాయపడ్డారు. తుపాను కారణంగా 2,437 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోగా ఇప్పటివరకు 484 గ్రామాల్లో పునరుద్ధరించినట్లు సిఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1400 ఆస్పత్రుల్లో ఉన్న కోవిడ్ రోగులకు నిరంతరాయంగా చికిత్స అందించడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య అని ఆయన చెప్పారు.
దెబ్బతిన్న గేట్‌వే ఆఫ్ ఇండియా రక్షణ గోడ
అటు ముంబయిలోను తుపాను భారీ విధ్వంసాన్నే సృష్టించింది. తుపాను గుజరాత్ తీరం వైపు కదిలే క్రమంలో సోమవారం ముంబయి నగరంలో కుండపోత వర్షాలు కురిసాయి. దీంతో మహానగరం మరోసారి మునిగింది. తుపాను తీవ్రతకు సముద్రపు అలలు ఇండియా గేటును సైతం దాటి ముందుకు చొచ్చుకు రావడంతో ఇండియా గేట్ వద్ద నిర్మించిన రక్షణ గోడలో కొంత భాగం, ఐరన్ గేట్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలపారు. అయితే ప్రధాన కట్టడానికి ఎలాంటి నష్టమూ వాటిల్ల లేదని, దాని దగ్గర ఉన్న ఫుట్‌పాత్‌లో కొంత భాగం మాత్రం కొట్టుకు పోయిందని వారు తెలిపారు. తుపానుతీవ్రత తగ్గిన తర్వాత ఇండియా గేట్ ప్రాంతంలో నాలుగు ట్రక్కుల చెత్తను తాము తొలగించినట్లు బృహన్ముంబయి కార్పొరేషన్ అధికారి ఒకరు చెప్పారు. ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లోని 18.43 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 52 శాతం కనెక్షన్లను పునరుద్ధరించామని, మిగతా కనెక్షన్లు కూడా పునరుద్ధరించడానికి యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటన తెలిపింది.13 వేలకు పైగా విద్యుత్ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌల్ చెప్పారు. ఈ రెండు జిల్లాలతో పాటుగా రాయిగడ్, ఠాణె, పాల్‌ఘర్ జిల్లాల్లోని 13,389మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఓ అధికార ప్రకటన తెలిపింది.

Tauktae Cyclone: 7 died in Gujarat due to Massive Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News