ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 202526 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత రెండుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మధ్యతరగతికి ప్రయోజనం కలిగించేవి ఏవీ లేవు. కేవలం స్థూల ఆర్థిక వర్గాలకే ఆ బడ్జెట్ ప్రయోజనం కల్పించింది. మధ్యతరగతి అంటే ప్రధానంగా వేతన జీవులు, పెన్షనర్లతో కూడుకున్నది. వీరంతా రానున్న బడ్జెట్‌లో తమకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. వినియోగం, డిమాండ్, బ్యాంకుల్లో సేవింగ్స్, చిన్నపొదుపు పథకాలు, క్యాపిటల్ మార్కెట్, ఆదాయం పన్ను కచ్చితంగా చెల్లించడం తదితర విధానాలు ద్వారా మధ్యతరగతి దేశ ఆర్థికానికి సహకరిస్తున్నారన్నది గమనించదగిన వాస్తవం. అందువల్ల కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి కొన్ని ప్రయోజనాలను ఆశించడానికి వీరు అర్హులవుతారు.
ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో వీరికి ప్రయోజనాలు కల్పిస్తే ఎప్పటిలాగే ఆర్థికంగా తోడ్పడగలుగుతారని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మధ్యతరగతి పైనే పన్నుల భారం అధికంగా పడుతుండటం జీర్ణించుకోలేని సమస్య. దీనికి కారణం వీరి వినియోగం డిమాండ్. వీరు కొనుగోలు చేసిన వస్తువులపై విధించే జిఎస్‌టి వీరి కొనుగోలు శక్తిని తగ్గించేస్తోంది. అధిక ఖర్చులతో మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. అందువల్ల రానున్న 2025 బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. వ్యవస్థీకృత రంగంలోనూ ఆదాయాలు వేర్వేరుగా ఉండడంతో దేశంలోని 10.4 కోట్ల పన్ను చెల్లింపుదారులకు స్థిరమైన ఆదాయం అవసరం చాలా ఉందని ఇటీవల చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అధ్యయనంలో తేలింది. ఇటీవల కొన్నిసంవత్సరాలుగా మధ్యతరగతి వర్గాలు కార్పొరేట్ల కన్నా చాలావరకు పన్ను భారాన్ని మోస్తున్నారు. 2023 నుంచి కార్పొరేట్ల నుంచి వచ్చే పన్ను వసూలు కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు అత్యధికంగా ఉంటోంది. 2024లో కార్పొరేట్ల పన్ను వసూలు కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 15% అధికంగా కనిపించింది. దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూలు ఆదాయంలో 54% అంటే మొత్తం రూ.19.6 లక్షల కోట్లలో 10.45 లక్షల కోట్ల వరకు వ్యక్తిగత పన్ను ఆదాయ వసూలే చోటుచేసుకుంది.
2024లో వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు 25% వరకు పెరగ్గా, కార్పొరేట్ ఆదాయ వసూలు 10.4 శాతం వరకే పెరుగుదల చూపించింది. అంటే ఆ మేరకు రూ. 9.1 లక్ష కోట్లు వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో ఈ తేడా మరీ ఎక్కువైంది. కార్పొరేట్ పన్ను వసూలు 2.3 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు 25% వృద్ధి కనిపించడం గమనార్హం. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం ఎవరైతే వార్షికాదాయం రూ. 5.5 లక్షల నుంచి రూ. 9.5 లక్షల కేటగిరిలో పొందగలుగుతున్నారో వారిపై పన్నుభారం అత్యధికంగా ఉంటోంది. ఆ కేటగిరి దాటి ఆదాయం ఉన్న వారికి పన్నుభారం తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతికి పన్నుభారం నుంచి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతోందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
అప్రకటిత ఆదాయం ఉన్న వారికి రూ. కోటి వరకు పన్ను చెల్లింపు వెసులుబాటు కల్పించడం, వారి నుంచే పన్ను చెల్లింపు తక్కువగా ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల తక్కువ స్థాయి ఆదాయ వర్గాల నుంచే 2015 2024 మధ్యకాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 3 లక్షల వరకు ఉన్న ఆదాయ స్లాబ్‌ను రూ. 5 లక్షల వరకు జీరో రేటు ఇన్‌కమ్ స్లాబ్‌గా సవరించాలని అంటున్నారు.ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులపై భారాన్ని తగ్గించడానికి తగిన సంస్కరణలు అవసరమన్న ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ విధానాలు మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల్లో తీవ్ర అసంతృప్తికి ఆజ్యం పోస్తున్నాయి. గత నెల (డిసెంబర్ 2024)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది. వివిధ రకాల పాప్‌కార్న్‌లపై వేర్వేరు జిఎస్‌టి రేట్లను విధించడం హాస్యాస్పదం అనిపించడమే కాక వినియోగదారుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమైంది. అలాగే వాహనాల రీసేల్‌పై పన్నులు విధిస్తూ తీసుకున్న నిర్ణయాలపై దుమారం చెలరేగింది. ఇది ఈ ప్రభుత్వ‘పన్ను తీవ్రవాదం’ అని, ఈ పన్నుల వ్యవస్థ దోపిడీయే తప్ప మరింకేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
దీనికి పెద్ద ఉదాహరణ ఆరోగ్యబీమాపై పూర్తిగా 18% జిఎస్‌టి విధించడం. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, జీవిత బీమా నుంచి కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి ద్వారా రూ. 16,398 వసూలు చేయగలిగింది. ఇంతచేసినా భారత దేశంలో 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతానికి జిఎస్‌టి పడిపోయింది. ద్రవ్యోల్బణం మధ్యతరగతి ఆదాయాలను దెబ్బతీస్తోంది. రోజువారీ ఖర్చులను బాగా పెంచేసింది. 2024 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయి 6.2 శాతానికి చేరుకుంది. ఆహార ధరలు 10.9% పెరిగాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఆరోగ్య భద్రత, విద్య ఖర్చులు భరించ్గాలంటే పన్నుల వ్యవస్థలో ప్రామాణిక తగ్గింపు పెంచాలని ఉద్యోగులు, పెన్షన్‌దారులు కోరుతున్నారు. మధ్య తరగతి వర్గాలకు పన్ను ఎంత సడలిస్తే అంత ఆర్థికంగా పెద్ద ఆసరా కలుగుతుంది. పన్నుల వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యం లభిస్తుందని ఆశిస్తున్నారు.