Monday, December 23, 2024

పన్నులవాతే సంపద సృష్టా?

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశం మొత్తం మీద సంపద సృష్టి చేయగలిగిన ఆర్ధిక బ్రహ్మగా, బ్రహ్మాండమైన నాయకుణ్ణి నేనేనంటూ చెప్పుకుంటున్న నాయకులు, వారికి వంతపాడే ఆర్ధిక మేధావులు, వారికి బాకాలూదే మీడియా సంస్థల వారు కోకొల్లలుగా ఉన్నారు మనకు. దశాబ్దాలుగా ఎన్నికల ముందు సభల్లో సహస్ర నామార్చనలా వినపడే ఈ సంపద మంత్రం అధికారంలోకి రాగానే వారికి వినపడని నిశ్శబ్ద తంత్రమై సుదీర్ఘకాలం తాము అధికారంలో ఉన్నా కూడా పేదల బతుకుల్లోకి ఈ సంపద జొరబడదు.

పరిధి దాటిన అప్పుల కుప్పలతో జీతాలు కూడా ఇవ్వలేని స్థితి లో ఖజానా ఖాళీగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జిఎస్‌టి, ఏకపన్ను వివిధ రాష్ట్రాల్లో విభిన్న విశ్వరూపమై ఏది కొన్నా, ఏది తిన్నా జేబులు ఖాళీ చేస్తోంది. ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే సంపద సృష్టి. కేంద్రం వివిధ పథకాలకు రాష్ట్రాల వాటా క్రింద ఇస్తున్న నిధులు పక్కదారి పట్టి ఏ ఖాతాలోనో సంపదగా పోగై ఉండవచ్చు.దేశంలోను, రాష్ట్రాల్లోను సామాజిక బాధ్యతగా మానవ వనరులు సద్వినియోగమై ఆర్ధికంగా ప్రజలంతా దిగువ మధ్య తరగతి గీతదాటి వస్తే సంపద సృష్టి జరిగినట్లే.

జాతీయ ఆదాయం పెరిగినట్టే. ప్రభుత్వాల మనుగడ కోసం, స్వార్ధపూరితమైన ఆలోచనలతో ఇసుక మొదలు, కరెంటు, వాటర్, ఆస్తి పన్నులు, నిత్యావసర వస్తువుల రేట్లు చుక్కలనంటించి, అన్ని శాఖల్లో పన్ను లు విపరీతంగా పెంచి, మద్యం ఏరులై పారించి, అదే సృష్టించిన సంపదని భ్రమింపజేస్తే ఆ భారాన్ని భరించలేక ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే వృత్తి పన్నులు, చెత్త పన్నులు అంటూ కొత్త పన్నుల బాటపట్టాయి. దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం జరిగి దశాబ్దాలు దాటుతున్నా కనీసం రిపేర్లకు నోచుకోకపోయినా టోల్ ట్యాక్స్‌తో తోలు తీసేస్తారు. ఇది చాలదన్నట్లు ఆస్తి వారసత్వపు సంపదపై కూడా పన్నులు విధించాలనే మెరుపు లాంటి ఆలోచనను కూడా సంపద సృష్టిలో భాగస్వామ్యం చేద్దామనుకుంటున్నారు. భూమి, అడవులు, సముద్ర, నదీ జలాలు, రవాణా, ఖనిజ సంపదలు దోపిడీకి గురవ్వకుండా సద్వినియోగం చేయగలిగితే సంపద సృష్టి జరుగుతుంది. ప్రపంచ బ్యాంకుల నుండి అప్పులు తేవడం, పేదల భూములన్నీ తక్కువ రేటుకు లాక్కుని ప్రభుత్వ బిల్డింగులు కట్టడం, అదే సంపద సృష్టి అనుకుంటే దానికి అనుభవం అక్కరలేదు.

ఏదో రకంగా మళ్ళీ మేమే గెలుస్తామని ధైర్యముంటే చాలు. నేనేసిన రోడ్లపై నడుస్తూ, నేనిచ్చిన కరెంటు వాడుకుంటూ, మా పాలనలో మాత్రమే కాపాడబడుతున్నఈ భారత దేశంలో నివసిస్తూ, మనుషులనే కాదు దేవుళ్ళను కూడా కాపాడుతున్న నాకెందుకు ఓటెయ్యరనే ఓటరునే ప్రశ్నించే తెగువతనం పాలకుల్లో కనబడుతున్నది. నాణ్యమైన ఉచిత విద్యనందించడంతో పాటు విదేశీ విద్యకు తోడ్పాటునందిస్తే విదేశాల్లో ఉద్యోగాలు చేసి మన దేశానికి సంపదను పంపుతారు. నాణ్యమైన ఉచిత వైద్యం ప్రభుత్వమే అందించి, ప్రజలకు ఖర్చు తగ్గిస్తే ఆరోగ్యమైన సమాజంతో పాటు ప్రజలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సన్న, చిన్నకారు రైతులకు నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, సరికొత్త సేద్యపు విధానాలు, నిరంతర నీటి సరఫరా, పంటలకు గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం శ్రద్ధపెడితే రైతే రాజై సంపదని సృష్టిస్తాడు. అంతేకాని ఆత్మహత్యల సౌధాలపై అర్ధిక జిడిపి లెక్కలు వేయకూడదు.

ప్రభుత్వ ఖజానాలను కొల్లగొట్టి దివాలా తీయిస్తున్న ఉచిత పథకాల పునాదుల పిల్లర్లపై పార్టీలను, ప్రభుత్వాలను నిలబెట్టరాదు. అత్యధిక జనాభా కలిగిన దేశంగా ముందు వరసలో ఉన్న మనం ఐక్యరాజ్య సమితి 2019 లెక్కల ప్రకారం సుస్థిరాభివృద్ధి సాధన సూచికలో అమెరికా, డెన్మార్క్ లాంటివి 40 వ స్థానం లోపలుంటే మనం 115 వ స్థానంలో ఉన్నాం. ఇది మన పాలకుల సుదీర్ఘ కార్యనిర్వాహక సామర్ధ్యం. ప్రణాళికాబద్ధంగా మానవ వనరుల అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయంలో నుంచి పేద వాళ్ళకు ప్రభుత్వాలు పన్ను రహిత ఉచిత సేవలు అందిస్తూ స్వయం ప్రకాశంగా ఎదిగేందుకు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ప్రయత్నిస్తే అదే సంపద సృష్టి. ప్రభుత్వ శాఖల్లో వారి జీతభత్యాలు, ఇతరత్రా ఉచిత సౌకర్యాలతో పాటు, పావలా పని చేసి పది రూపాయల ప్రచారం కోసం చేసే ప్రభుత్వ ఖర్చు, ఇవన్నీ తగ్గించే పొదుపు ద్వారా సంపద సృష్టి జరుగుతుంది.

సౌర విద్యుత్తు ఉత్పత్తి ద్వారా విద్యుదుత్పాదక ఖర్చుతో పాటు నీటి వినియోగం తగ్గించవచ్చు. అపారమైన నీటి వృథా అరికట్టడం, అటవీ వృక్షసంపదను కాపాడడం ద్వారా ఔషధ రూపంలో మందుల ఉత్పత్తి ఖర్చు తగ్గించవచ్చు. ఏదైన మామూలు మనిషి జీవనం మెరుగుపడే విధంగా చేస్తే అదే సంపద సృష్టి. పాలనలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా చేయాలంటే సంపద సృష్టించడానికి ఏ నాయకుని వద్దనైనా ఏవైనా తంత్ర విద్యలు, మంత్ర దండాలు ఉన్నాయేమో తెలియదు మరి! –

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News