డివిజిబుల్‌లోనే పన్నులు వసూలు చేయాలి : మంత్రి హరీశ్‌రావు తీర్మానాన్ని బలపరిచిన ఎంపి రంజిత్ రెడ్డి, ప్లీనరీలో 13 తీర్మానాలకు ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి సుమారు ఎనిమిదేళ్లు నిరాటంకంగా పాలన కొనసాగిస్తున్న టిఆర్‌ఎస్ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో బుధవారం ప్లీనరీ నిర్వహించింది. ఈ ప్లీనరీ వేదికగా 13 తీర్మానాలు ఆమోదించుకున్నారు.
ప్లీనరీ వేదికగా ఆమోదించుకున్న 13 తీర్మానాలు ఇలా..
1.యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా మంత్రి గంగుల కమలాకర్ దానిని బలపరిచారు.
2.దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని మంత్రి కెటిఆర్ ప్రవేశపెట్టగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి దానిని బలపరిచారు.
3.ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానిని ఎమ్మెల్యే రేగా కాంతారావు బలపరిచారు.
4.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానిని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బలపరిచారు.
5.భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దానిని బలపరిచారు.
6.బిసి వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బిసి సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బిసి వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని మధుసూదనా చారి ప్రవేశపెట్టగా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దానిని బలపరిచారు.
7. రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ హోంమంత్రి మహమూద్ అలీ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రవీందర్‌కుమార్‌లు బలపరిచారు.
8.రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీష్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎంపి రంజిత్ రెడ్డి బలపరిచారు.
9.నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ దానిని బలపరిచారు.
10.భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ ఎంపి నామా నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభ ఎంపి సురేష్‌రెడ్డి దానిని బలపరిచారు.
11.తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మంత్రి సబితారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దానిని బలపరిచారు.
12.చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ ఎల్.రమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దానిని బలపరిచారు.
13.దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌లు దానిని బలపరిచారు.