Friday, November 22, 2024

కొత్త ఐటి ఇఫైలింగ్ పోర్టల్‌లో లోపాలు

- Advertisement -
Taxpayers face problems with the new ITR portal
వినియోగదారుల నుంచి ఫిర్యాదుల వెల్లువ
పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌ను కోరిన ఆర్థికమంత్రి నిర్మల
న్యూఢిల్లీ : కొత్త ఆదాయం పన్ను ఇఫైలింగ్ వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్‌ను కోరారు. సోమవారం కొత్త ఐటి ఇఫైలింగ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ప్రారంభించినప్పటి నుంచి అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ట్విట్టర్ మాద్యమం ద్వారా పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటి ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సోమవారం అర్థరాత్రి ప్రారంభించారు. కొత్త వెబ్‌సైట్ మునుపటి కంటే మెరుగ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కొన్ని గంటల తర్వాత వెబ్‌సైట్‌లో లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెంటనే స్పందించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని ఆమె కోరారు.
కొత్త పోర్టల్ రూపకల్పన, నిర్వహణ బాధ్యత ఇన్ఫోసిస్‌కు అప్పగించారు. నెక్ట్ జనరేషన్ ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలంటూ ప్రభుత్వం 2019లో ఇన్ఫోసిస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంతో 63 రోజుల నుంచి ఒక రోజుకు ప్రాసెసింగ్ టైమ్ తగ్గించి, రిఫండ్స్‌లను వేగవంతం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 సోమవారం రాత్రి 10.45 గంటలకు ప్రారంభమైంది. దీనిపై చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. వారు సైట్ ఓపెన్ కావడం లేదంటున్నారు. నందన్ నీలేకనిని ట్యాగ్ చేస్తూ, పన్ను చెల్లింపుదారులు సేవనాణ్యతను తగ్గించనివ్వవద్దని రాశారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను సులభతరం చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థికమంత్రి తన ట్వీట్లో రాశారు. కొత్త వెబ్‌సైట్ జూన్ 7 నుండి ప్రారంభమైంది, అయితే జూన్ 18న పన్ను చెల్లింపు విధానం ప్రారంభిస్తారు. ఇవే కాకుండా మొట్టమొదటిసారిగా మొబైల్ యాప్ సౌకర్యం కూడా జూన్ 18 నుండి ప్రారంభమవుతుంది. దీంతో పన్ను చెల్లింపుదారులు యాప్‌లో పన్ను సంబంధిత పనులు చేసుకోవచ్చు.
కొత్త వెబ్‌సైట్ గురించి..
కొత్త వెబ్‌సైట్ మరింత యూజర్ ఫ్రెండ్లీ. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ను దాఖలు చేయడం, వేగంగా రిటర్న్‌ల పొందడం సులభం చేస్తుంది.
అన్ని లావాదేవీలు, అప్‌లోడ్‌లు, పెండింగ్ చర్యలు ఒకే డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయి. దీంతో వినియోగదారులు వాటిని సమీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకోవచ్చు. అంటే ఐటిఆర్ దాఖలు చేయడం, సమీక్షించడం, ఏదైనా సులభం అవుతుంది.
ఐటిఆర్ సాఫ్ట్‌వేర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పరిస్థితులకు లభిస్తుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు సహాయం చేసే సదుపాయాన్ని కలిగి ఉంది. ప్రీ-ఫైలింగ్ ఎంపికను కలిగి ఉంది.
కొత్త పోర్టల్‌లో నూతన పన్ను చెల్లింపు విధానం ప్రవేశపెట్టారు. దీనిలో నెట్ బ్యాంకింగ్, యుపిఐ, ఆర్‌టిజిఎస్, నెఫ్ట్ వంటి బహుళ చెల్లింపు విధానాలు ఉంటాయి.
పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దీనిలో చాట్‌బాట్ కూడా అందుబాటులో ఉంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News