కొవిడ్ రోగులకు కేంద్రం సవరించిన వైద్యమార్గదర్శకాలు
న్యూఢిల్లీ : కొవిడ్ రోగుల్లో రెండు మూడు వారాలకు మించి దగ్గు కొనసాగుతుంటే క్షయ వ్యాధి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. ఈమేరకు ఎయిమ్స్, ఐసిఎంఆర్‌కొవిడ్ 19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ జాయింట్ మోనిటరింగ్ గ్రూపు (డిజిహెచ్‌ఎస్) సవరించిన వైద్య మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరా అవసరం లేకుండా, ఎక్కువ డోసుల స్టెరాయిడ్ల ఇంజక్షన్లను కొవిడ్ రోగులు చికిత్సలో కానీ తరువాత కానీ వినియోగించడం వల్ల ప్రయోజనం కలుగుతుందనడానికి ఎలాంటి సాక్షాధారాలు లేవని వివరించింది. ఇటువంటి స్టెరాయిడ్లను ప్రారంభ దశలో లేదా అవసరానికి మించి సుదీర్ఘకాలం వినియోగిస్తే బ్లాక్ ఫంగస్ (మ్యూకోమైకోసిస్) రెండో ఇన్‌ఫెక్షన్‌గా సంక్రమిస్తుందని హెచ్చరించింది. ఇదే సమయంలో రెండు మూడు వారాల పాటు దగ్గు కొనసాగుతుంటే క్షయవ్యాధి పరీక్షలు కానీ లేదా ఇతర పరీక్షలు కానీ కొవిడ్ రోగులు చేయించుకోవాలని సూచించింది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం…..
1) మితం నుంచి తీవ్ర స్థాయి లక్షణాలున్న కొవిడ్ రోగులు అత్యవసరంగా రెమ్‌డెసివిర్‌ను వినియోగించవచ్చు. లక్షణాలు ప్రారంభమైన పది రోజుల్లో మూత్ర పిండాలు, కాలేయ పటిష్ఠత వైఫల్యం లేని వారు మాత్రమే ఈ అత్యవసర వైద్యం చేయించుకోవాలి
2.) ఆక్సిజన్ ఆధారం లేనివారు లేదా హోమ్ సెట్టింగ్స్ లేనివారు ఈ డ్రగ్‌ను వాడరాదు.
3) తీవ్ర వ్యాధి లక్షణాలున్నవారు టొసిలిజుమాబ్ డ్రగ్‌ను వాడవచ్చు. ముఖ్యంగా వ్యాధి ప్రారంభంలో 24 నుంచి 48 గంటల సమయంలో లేదా ఐసియులో అడ్మిట్ అయినప్పుడు వాడాలి.
4) స్టెరాయిడ్లు వాడినా ఉపయోగం కనిపించలేనప్పుడు, బాక్టీరియా, ఫంగస్, లేదా క్షయ సోకనప్పుడు మాత్రమే టొసిలిజుమాబ్ వినియోగించాలి.
కరోనా రోగులను తేలికపాటి, మిత, తీవ్ర వ్యాధి అనే లక్షణాలు వారీగా విభజిస్తారు.
5) మితమైన లక్షణాలున్న కరోనా రోగులకు 5 నుంచి 10 రోజుల విరామంలో మెథైల్ ప్రెడ్నెసొలోన్ లేదా డెక్సామెథసోన్ 0.5 నుంచి ఒక ఎంజి/కెజి ని రెండు వేర్వేరు డోసులుగా ఇవ్వాలి.
6) జ్వరం లేదా దగ్గుతో తేలికపాటి లక్షణాలున్న కొవిడ్ రోగులకు ఐదు రోజులు మించి ఆయా లక్షణాలు కొనసాగుతుంటే ఇన్‌హెలేషనల్ బుడెసొనైడ్ అనే పౌడరును 800 ఎంసిజి బిడి డోసుతో ఐదు రోజుల పాటు ఇవ్వాలి.
మితమైన, తేలికపాటి, తీవ్రమైన లక్షణాలను ఎలా గుర్తిస్తారో మార్గదర్శకాల్లో వివరించారు.
శ్వాసనిశ్వాసల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే అటువంటి కొవిడ్ రోగులను తేలికపాటి లక్షణాలున్నవారిగా గుర్తిస్తారు. అలాంటివారు హోమ్ ఐసొలేషన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఊపిరి తీయడం ఏమాత్రం కష్టమైనా, జ్వరం తీవ్రస్థాయిలో వచ్చినా అలాగే తీవ్రంగా దగ్గు కొనసాగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎవరికైతే సరిపడే ఆక్సిజన్ సంతృప్తత లేక ( ఎస్‌పిO2 ) ఊపిరాడక , 90 93 శాతం మధ్య హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయో వార్డులో వారిని అడ్మిట్ చేయవలసి వస్తుంది. ఆ కేసులను మితమైన ( మోడెరేట్) కేటగిరిగా గుర్తించవలసి ఉంటుంది. వీరికి ఆక్సిజన్ సపోర్టు తప్పనిసరి. ప్రతి రెండు గంటల కోసారి వీరి పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలి. ప్రతి నిమిషానికి ఊపిరి వేగం 30 కన్నా మించితే ,ఊపిరాడని పరిస్థితి ఏర్పడితే లేదా ఎస్O2 గదిలోని గాలి కన్నా 90 శాతం తక్కువ స్థాయిలో ఉన్నట్టయితే తీవ్రమైన పరిస్థితిగా పరిగణించవలసి వస్తుంది. అలాంటి కొవిడ్ రోగులను తక్షణం ఐసియులో అడ్మిట్ చేయక తప్పదు. వారికి రెస్పిరేటరీ సపోర్టు ( శ్వాసక్రియ ఆధారం ) అవసరం
అరవై ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ రిస్కు
అరవై ఏళ్లు పైబడినవారిలో గుండె నాళాల వ్యాధులు, రక్తపోటు, దమని వ్యాధులు, మధుమేహులకు , రోగనిరోధక శక్తి తగ్గినవారికి. హెచ్‌ఐవి, క్షయ, దీర్ఘకాల ఊపిరి, మూత్రపిండాల,కాలేయ వ్యాధులున్న వారికి, మస్తిష్క నాళాల వ్యాధుల వారికి, ఊబకాయులకు, మరణప్రమాదం ఉన్న వారికి ఎక్కువ రిస్కు ఉంటుందని వైద్య మార్గదర్శకాలు హెచ్చరించాయి.