హెచ్1బి వీసాపై భారతీయులకు అనుకూలంగా వ్యవహరించింది
20 మంది యుఎస్ టిసిఎస్ ఉద్యోగుల ఆరోపణ
వివక్ష ప్రదర్శించలేదని సంస్థ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : జాతి, వయస్సు ఆధారంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చట్టవిరుద్ధంగా వివక్షకు పాల్పడిందని అమెరికాలోని 20 మందికి పైగా టిసిఎస్ ఉద్యోగులు ఆరోపించినట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ (డబ్లుఎస్‌జె) వెల్లడించింది. హెచ్1బి వీసాలపై భారత్ నుంచి వచ్చిన ఉద్యోగులకు అనుకూలంగా టిసిఎస్ తమను అకస్మాత్తుగా తొలగించిందని 22 మంది అమెరికన్ ప్రొఫెషనల్స్ ఆరోపించారు. టిసిఎస్ లే ఆఫ్ చేసిన వ్యక్తులలో కాకషియన్లు, ఆసియన్-అమెరికన్లు , హిస్పానిక్ అమెరికన్లు ఉన్నారు. వారంతా 40, 60 ఏళ్ల మధ్య వయస్కులు.
వారు అమెరికా వ్యాప్తంగా డజనుకు పైగా రాష్ట్రాలలో నివసిస్తుంటారు. ఫిర్యాదుల ఆధారంగా టిసిఎస్ తొలగించిన ఉద్యోగులలో పలువురు ఎంబిఎ లేదా ఇతర అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగిన వారు. తమపై వివక్ష ప్రదర్శించడం ద్వారా, యుఎస్‌లో హెచ్1బి వీసాలు ఉన్న భారతీయ సిబ్బందికి ‘ప్రాధాన్యం’ ఇవ్వడం ద్వారా భారత ఐటి దిగ్గజం చట్టాలను అతిక్రమించిందని అమెరికన్ ప్రొఫెషనల్స్ ఆరోపించారు. తక్కువ అర్హతలు ఉన్న ‘తక్కువ ఖర్చు’ అయ్యే విదేశీ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారని కూడా అమెరికన్ ఉద్యోగులు ఆరోపించారు. అయితే, వివక్ష ఆరోపణలను టిసిఎస్ ఖండించింది. ‘టిసిఎస్ చట్టవిరుద్ధంగా వివక్షకు పాల్పడుతున్నదనన ఆరోపణ నిరాధారం, తప్పుదోవ పట్టించేది. యుఎస్‌లో సమాన అవకాశాలు కల్పిస్తున్న సంస్థగా టిసిఎస్‌కు ఘనమైన రికార్డు ఉంది’ అని టిసిఎస్ స్పష్టం చేసింది.