Friday, November 15, 2024

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండనున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంతో టిడిపి రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నదని స్పష్టమైంది. ప్రస్తుతం రాజ్యసభలో టిడిపికి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. ఆయన పదవీ కాలం సైతం త్వరలో ముగియనున్నది. టిడిపి రాజ్యసభ ఎన్నికలో పోటీ చేయకపోతే రాజ్యసభలో టిడిపికి ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. ప్రస్తుతం టిడిపికి అసెంబ్లీలో బలం 18కి పరిమితమైంది.

రాజ్యసభ స్థానాన్ని గెలవాలంటే టిడిపి 41 మంది శాసన సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే టిడిపికి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. పోటీకి దిగి అవమానం పొందడం ఎందుకన్న భావనతోనే టిడిపి రాజ్యసభ స్థానానికి పోటీపడడం లేదని స్పష్టమైంది. ఎగువ సభలో ఇక టిడిపికి చోటే ఉండకపోవచ్చని తెలుస్తోంది.

నామినేషన్ల చివరి తేదీ ఫిబ్రవరి 15, నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16న పూర్తవుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 20 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదిలావుండగా వైసిపి అభ్యర్థులు మినహా ఇంకెవరు నామినేషన్లు దాఖలు చేయకపోతే వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. కాగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసి పరాభవం పాలయ్యే కన్నా దూరంగా ఉండటమే మేలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ స్థానాలు గెలుచుకుని మళ్లీ రాజ్యసభలో అడుగు పెడదాం అంటూ ఆయన పార్టీ సభ్యులకు నచ్చచెబుతున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News