భోజనం, తాత్కాలిక వసతి, బట్టలు పంపిణీ చేద్దాం
టి టిడిపి శ్రేణులకు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్ : వరుస వానలతో వరద బాధితులకు అండగా ఉందామని, బాధితులకు భోజనం, తాత్కాలిక వసతి, బట్టల పంపిణీ చేద్దామని పార్టీ శ్రేణులకు టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపు నిచ్చారు. గత వారం పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భూపాలపల్లి, ములుగు, అదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్, మహబూబాబాద్, తదితర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు పొంగుతున్నందున రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో వరద ముంపుతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
Also Read: కాంగ్రెస్ వీడను….కారెక్కను: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అలాగే హైదరాబాద్ మహా నగరం, నగర శివారు ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోని చెరువులు, నాలాలు పొంగి జనావాసాల్లోకి వరద నీరు చేరి ఇళ్లు, కాలనీలు మునిగిపోవడం వల్ల వరద ముంపుతో కాలనీల్లోకి నీరు చేరి నానా కష్టాలు పడుతున్నారన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వానలు, వరదల్లో చిక్కుకున్న సాటి ప్రజలను మానవతావాదంతో కాపాడి ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత తెలుగుదేశం పార్టీగా మనందరిపై ఉన్నదన్నారు. అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాల మూలంగా నెలకొన్న వరద ముంపు, ఇతరత్రా విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చి బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్నిరకాల సహాయక, పునరావాస చర్యల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ముమ్మరంగా పాలుపంచుకోవాలని కాసిని పిలుపు నిచ్చారు.
ఆపదలో చిక్కుకున్న ప్రజలను కాపాడి వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, వరద ముంపు నుండి కాపాడబడ్డ బాధితులకు భోజన వసతి, దుస్తుల పంపిణీ, ఇతరత్రా సహాయక, పునరావాస చర్యలను స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆయన కోరారు. ఇలాంటి సహాయక చర్యలను పార్టీకి చెందిన అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంటు, రాష్ట్ర స్థాయి నాయకులు పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలన్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొని తోటి ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలిచి పేదల సంక్షేమం కోసం పుట్టిన మన పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కాసాని అన్నారు.