Monday, January 20, 2025

తెలంగాణలో పొత్తుల విషయం చంద్రబాబే నిర్ణయిస్తారు: బాలకృష్ణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎంఎల్‌ఏ నందమూరి బాలకృష్ణ అన్నారు. బాబు అరెస్ట్ అంశంపై అక్క దగ్గుబాటి పురందరేశ్వరితో టచ్ లో ఉన్నానని, ఈ విషయంలో కేంద్ర పెద్దలను కలుస్తానని ఆయన వెల్లడించారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని ..కార్యకర్తల్లో ధైర్యం, పార్టీ బలోపేతం కోసం కంకణం కట్టుకున్నామన్నారు. పార్టీలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని, త్వరలో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. ఇక ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా పార్టీ పునర్వైభవం కోసం కృషి చేస్తామన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు ఈ విషయం ఎలా చూస్తారు.? అన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఐ డోంట్ కేర్..సినిమా రంగం నుంచి ఎవరు ఖండించకపోయినా తాను పట్టించుకోను అని పేర్కొన్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో తానే ప్రచారనికి వస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల్లో కాస్త భయం, స్థబ్తత ఉండిందని , కానీ ఈ సారి రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ చాలా క్లియర్ గా ఉందన్నారు. చంద్రబాబు నిజాయితీ ఏంటో ప్రపంచం అంత తెలుసునన్నారు. కానీ కొందరు రాజకీయ కక్షలో భాగంగా ఆయన్ను కేసులో ఇరికించారని వైసిసి పార్టీని ఉద్దేశించి అన్నారు.

రిమాండ్‌కి తీసుకొంటే కొన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది కానీ చంద్రబాబు విషయంలో పూర్తి భిన్నంగా జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి వైసిపి వాళ్ళు చట్టాలు సృష్టించారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుతో తలపండిన వారు అందరు కూడ నివ్వెర బోతున్నారన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్‌లతో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడారు. లేనిది సృష్టించి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసారని, ఆ అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు. న్యాయ పరంగా ఎంత దూరం అయినా వెళ్తామన్నారు. పార్టీ పునర్ వైభవం కోసం ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అన్ని అనుబంధ సంఘాలతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకీ ఇప్పుడు టైం వచ్చిందన్నారు. తన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు ఒక తాటిపైకి వచ్చి కలిసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ క్షణం నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News