Monday, January 20, 2025

టిటిడిపి ‘ఓటర్లు ’ ఎటు వైపు..?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్సా..కాంగ్రెస్సా.. బిజెపి వైపా..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమన్న టిడిపి
దీంతో పక్క చూపు చూస్తున్న పార్టీ ఓటర్లు..సానుభూతి పరులు
టిడిపి ఓట్ల కోసం పార్టీల గాలం
బాబు అరెస్టును ఖండించిన పలు పార్టీలు
కమ్మ, సెటిలర్స్ ఓట్లపై బిఆర్‌ఎస్ సహా అన్ని ఫార్టీల ఫోకస్
జనసేనతో పొత్తుతో కాపు ఓట్లపై బిజెపి ఆశలు
సెటిలర్లు తమ వైపే అంటున్న బిఆర్‌ఎస్
నేతలు మారినా ఓట్ బ్యాంక్ మారదంటున్న టి టిడిపి
తటస్థం అని కొందరు.. బిఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్‌కే ఓటువేయచ్చని మరి కొందరు
కాసానిని రాజ్యసభ సభ్యుడిని చేస్తానన్న వినలేదన్న చంద్రబాబు !!

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమన్న టిటిడిపి ప్రకటించడంతో అందరి దృష్టి ఆ పార్టీ ఓటర్లు.. సానుభూతిపరులపైనే పడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయించుకోవాలని టిడిపి ఓట్ల కోసం పార్టీలు గాలం వేస్తున్నాయి. మరి ఇంతకూ ఓటర్లు ఎటు వైపు? బిఆర్‌ఎస్ వైపా..కాంగ్రెస్ వైపా…బిజెపి వైపా? ప్రస్తుతం టిడిపి ఓటు బ్యాంక్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీలు అన్నాక ప్రతి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండనే ఉంటుంది. ఈ కోవలో టిటిడిపికి భారీగానే ఓటు బ్యాంక్ ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును నాలుగు సార్లు అధికారంలోకి తెచ్చిన పార్టీ కూడా టిడిపి ఓటర్లే.. రాష్ట్ర విభజన జరిగినా పొరుగు రాష్ట్రం ఏపిలోనూ టిడిపి అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ ఓటర్లు టిడిపి పట్ల చూపించిన అభిమానం అది. అలాగే ఓటర్లు అన్నాక ప్రతి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉండనే ఉంటుంది. ఏ ఎన్నిక వచ్చినా వారి ఓటు ఆ పార్టీకే వేయడం పరిపాటి. మరి ఈ సారి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. అలా అని ఓటర్లు దూరంగా ఉండరు కదా! మరి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ ఎటు వైపు మొగ్గు చూపనుందనే దానిపైనే రాజకీయ పార్టీలో విస్త్రృతంగా చర్చ జరుగుతోంది.

టిటిడిపి ఓటు బ్యాంక్ బిఆర్‌ఎస్ వైపేనా
కాగా టిటిడిపి ఓటు బ్యాంక్ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? బిఆర్‌ఎస్ వైపేనని కొందరు అంటుంటే…కాంగ్రెస్ వైపు అని మరి కొందరు చెబుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో జతకట్టడం ఏపిలో తెలుగుదేశం పార్టీతో ఉండడంతో తెలంగాణలో బిజెపి వైపు మొగ్గు చూపుతారని మరి కొందరు చెబుతున్నారు. ఏతా వాతా టిడిపి పోటీ చేయక పోవడం కారణంగానే ఆ పార్టీ ఓటర్లు, సానుభూతి పరులంతా పక్క చూపు చూస్తున్నారని మరి కొందరు గుర్తు చేస్తున్నారు. కాగా టిడిపి ఓట్ల కోసం పలు పార్టీలు గాలం వేస్తున్నాయి. ఓ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంతో ఆయనకు ఆయా పార్టీలు తమ సానుభూతినీ తెలిపాయి.

ఇదంతా టిటిడిపి ఓట్ల కోసమేనని ఎవరు విమర్శలు చేసినా ఆ పార్టీ ఓటర్లు మాత్రం తప్పకుండా ఎవరో ఒకరికి ఓటు వేయడం మాత్రం ఖాయం కావడంతో ..నొప్పించక తానొవ్వక అన్నట్లు వారి ఓట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కమ్మ, ఆంధ్ర సెటిలర్ల ఓట్లపైనే బిఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. కాగా జనసేనతో పొత్తు కుదుర్చుకోవడంతో బిజెపి మాత్రం పవన్ ద్వారా టిడిపి ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. 2014లో 15 సీట్లు టిడిపి గెలుచుకుందని, అప్పట్లో ఆయా నేతలు మారినా తమ ఓట్ బ్యాంక్ మాత్రం మారదని టిటిడిపి నేతలు చెబుతున్నారు. కాసాని రాజీనామా చేసి బిఆర్‌ఎస్‌లో చేరిన రోజునే చంద్రబాబు నాయుడు తీవ్ర మథనపడ్డారని, ఏపిలో టిడిపి గెలిచినా అక్కడి నుండి కాసానికి కనీసం రాజ్యసభ సభ్యుడిగా చేసుకుందామని భావించామని అయితే ఇవేవీ కాదని అతను పార్టీని వీడడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని టిడిపి నేతలతో చంద్రబాబు అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం . తెలంగాణ ఆవిర్భావం నుండి టిటిడిపి ఒక్కొక్కరినీ కోల్పోతూ అధికార పార్టీ కైవసం చేయించుకోవడంతో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటామని.. అందాక కాస్త ఓపిక పట్టాలని పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు చెబుతున్నారని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News