జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురంలో ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే, ఆయనకు తెలుగు దేశం పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లిన నాగబాబును టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టి.. జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
కాగా, ఇటీవల జరిగిన జనసేన పార్టీ 14వ ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలువడానికి కారణం మేమే అని ఎవరైన అనుకుంటే.. అది వారి కర్మ అంటూ ఇన్ డైరెక్ట్ గా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వర్మకు కౌంటర్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలు నాగబాబుపై ఆగ్రహంగా ఉన్నారు.