Thursday, January 16, 2025

అస్థిర పరిచే శక్తులకు బుద్ధి చెప్పండి

- Advertisement -
- Advertisement -

రూ. 50 లక్షలతో పట్టుబడిన నేతను నాపై పోటీకి నిలబెట్టిండ్రు

పుట్టుక నుంచి కామారెడ్డితో అనుబంధం కెసిఆర్ ఒక్కడే రాడు.. వెంబడి చాలా వస్తయ్
నియోజకవర్గ రూపురేఖలే మారిపోతయి రెండేళ్లలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు
నీళ్లు తెచ్చి చూపిస్తా తెలంగాణకు రావలసిన రూ.25 వేల కోట్ల నిధులకు కోత పెట్టిన బిజెపోడు
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతుండు
బిజెపోళ్లేమో మోటర్లకు మీటర్లంటరు..
కాంగ్రెసోళ్లేమో రైతుబంధు వద్దంటుండ్రు
కామారెడ్డి సభలో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్

తెలంగాణ ఉద్యమం అప్పుడు గిట్లనే నన్ను అర్రతిప్పలు పెట్టిండ్రు.. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికి.. ఎడ్డం అంటే తెడ్డెం అని.. ఆవునంటే కాదని.. ఎన్ని రకాల గోసలు పెట్టాల్నో అన్ని పెట్టిండ్రు. చివరకు నాకు తిక్కరేగి కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ శవయాత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని బయల్దేరితే.. ఎక్కడికక్కడ మీరు నరసింహులై లేస్తే.. ఊర్లన్ని ఉద్యమాలైతే.. సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసిండ్రు. వెంటనే ఇచ్చిండ్రా అంటే మల్ల ఏడాదిన్నర ఎగవెట్టిండ్రు. సకల జనుల సమ్మె అని యావన్మంది ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడితే.. చివరకు తెలంగాణల నూకలు పుట్టకుండా అయితయని అప్పుడు ముందుకొచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను కూడా బతకనీయొద్దు.. దీన్ని ముందల పడనీయద్దు.. రాజకీయ అస్థిరత తేవాలని ఎంఎల్‌ఎలను కొనే ప్రయత్నం చేసింది. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతో పట్టుబడ్డడో.. ఇప్పుడు ఆ మహాత్ముడే కామారెడ్డిల నామీద పోటీకొస్తడంట. ఎవరికి ఏం బుద్ధి చెప్పాల్నో మీరే నిర్ణయం చేయాలి.

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి: రాష్ట్రంలో అస్థిరతను సృష్టించటానికి కుట్రలు చేస్తున్నారని, రూ. 50 లక్షలతో దొరికినోడు ఇక్కడ నుంచి నాపై పోటీ చేస్తున్నాడని వారికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ అన్నారు. తనకు కామారెడ్డి గడ్డతో ఆత్మీయ సంబంధం ఉందని, మా అమ్మ పుట్టింది బీబీపేట మండలంలోని కోనాపూర్ గ్రామం అన్నారు. తన మేనమామలు ఆరుగొండలో ఉంటారని, సభ్యులు కామారెడ్డిలో జలసాధన కార్యక్రమంలో భాగం గా బి గ్రేడెరియర్‌గా పనిచేశానని, ఇక్కడి న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. కామారెడ్డి ప్రజల ఆకాంక్ష మేరకే పోటీ చేస్తున్నానని, మీ దీవెనలు నాకు శ్రీ రామ రక్ష అని సిఎం కెసిఆర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నేరుగా హెలికాప్టర్ ద్వారా కామారెడ్డికి చేరుకుని, అక్కడి నుంచి వాహనాల ద్వారా గంప గోవర్ధన్ స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు నాయకులతో మాట్లాడారు.

అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి, ఎన్నికల్లో ప్రజలు గెలిచే డెమోక్రసి మన దేశంలో రావాలని కోరుకుంటున్నానన్నారు. కామారెడ్డిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వ రిత గతిన పూర్తి చేసే బాధ్యత తనకు అప్పజెప్పాలని కోరారు. కామారెడ్డికి కెసిఆర్ ఒక్కడే రాడని, చాలా వస్తాయని, రెండు సంవత్సరాల లోపు సాగునీరు వస్తుందని, పట్టణంతో పాటు పల్లెల రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నియోజ కవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్నికల వేళ ఎవరి మాట వినవద్దని, గందర గోళ పరిస్థితులు సృష్టిస్తారని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని, 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధ్ది 10 సంవత్సరాలలో చేసి చూపించామన్నారు.

సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు కరెంట్ తిప్పలు, సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులను పట్టించుకునే నాథుడే లేదని ఆరోపించారు. 50 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఒక్క పనైనా చక్కగా చేసిందా అని ప్రశ్నించారు. మళ్లీ ఏం చేద్దామని ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని, వారి గత చరిత్రను గ్రామాలలో చర్చించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడి కార్మికులకు పెన్షన్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయా న్ని నాశనం చేశారని, రైతులను ఆదుకోవడానికి 24 గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధుతో పాటు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని, 3గంటలు కరెంట్ కోరుకునే కాంగ్రెస్ రావాలా? 24 గంటలు కరెంట్ కావాలంటే చేతులు పైకి లేపాలని సూచించడంతో కేసిఆర్ జిం దాబాద్ నినాదాలతో పిడికిలి బిగించి నినాదాలు చేశారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక్క నవోదయ పాఠశాలను మంజూ రు చేయాల్సి ఉండగా కేంద్రం మొండి చేయి చూపిందని, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బిజెపీకి ఎందుకు ఓటు వేయ్యాలో గ్రామాలలో మీరే చర్చించాలని సూచించారు. ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ గగ్గొలు పెడుతుందని, రాహుల్ గాంధీ ఎప్పుడైనా నాగలి పట్టాడా అని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖలో తప్పిదాలు జరుగవద్దనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ తెచ్చామని,మీ భూములపై మీకే అధికారాన్ని అప్పగించామని పేర్కొన్నారు.

వాళ్లను బంగాళాఖాతంలో వేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణిని బంగాళాఖాతంలో పెడతామని అంటున్నారని అలాంటి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని సిఎం కెసిఆర్ ప్రజలకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే గ్రామాలలో ఉప్పెనలాగా ఉద్యమాన్ని చేపట్టానని, ప్ర.జల ఉద్యమ ఉధృతిని తట్టుకోలేని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. గతంలో ప్రాజెక్టుల కింద నీటి తీరువా పన్ను ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు సరఫరా చేస్తున్నామన్నారు. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా ఆదుకుంటున్నామని, దళితులను కేవలం ఓట్ల కోసమే ఉపయోగించుకున్నారని, వారిని అన్ని విధాల ఆదుకునేందుకు దళితబంధు ప్రవేశ పెట్టామన్నారు. రూ.33 వేల కోట్ల చేపలను ఎగుమతి చేశామని, అన్ని కులాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో కులం, మతం, జాతీయం అంటూ ఏమి లేదని, అందరూ తెలంగాణ ప్రజలేనని, వారు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు. మైనార్టీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు షాదీముబారక్ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.
ఓటుకు నోటు కేసులో దొరికినోడు నాకు పోటీనా..?

ప్రాణాలను సైతం పణ్ణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో రూ. 50 లక్షలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన మోసగాడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నాపై పోటీకి దిగాడు,  అలాంటి వాడికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక ఇబ్బందులు పెట్టారని అయినా కూడా ఎక్కడ బెదరకుండా రాష్ట్ర సాధనలో లక్ష్యంగా పోరాడానన్నారు. చివరకు ప్రాణాలను సైతం లెక్కలేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు దిగితే కానీ ఢిల్లీ పెద్దలు కదిలివచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.

గత ప్రభుత్వాల పనితీరును, 10 సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గ్రామాలలో చర్చించాలని, కాంగ్రెస్, బిజెపీ కు టిల ప్రయత్నాలకు అడ్డుకోవాలన్నారు. మళ్లీ తమకు అధికారాన్ని అప్పగిస్తే తెలంగాణను ఆగం కాకుండా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానన్నారు. అదే విధంగా పార్టీ కోసం నిస్వార్ధంతో పనిచేస్తున్న గంప గోవర్దన్‌కు రానున్న రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తానని దానికి నాది హామీ అని కెసిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుభాష్ రెడ్డి, బాలమల్లు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, కేశవ రావు, ఎంపీ బీబీ పాటిల్, తిర్మల్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ రామ్మోహన్, కాసాని జ్ఞానేశ్వర్, ముజీబుద్దీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి, జడ్పీ చైర్‌పర్సన్ శోభ రాజు, గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, నాయకులు నిట్టు వేణు గోపాల్‌రావు, వేణు గోపాల్ గౌడ్, మామిండ్ల అంజయ్య, మసూద్, జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News