రాణిపేట (తమిళనాడు) : తమిళనాడులోని అధికార డిఎంకె, బిజెపి నేతృత్వంలోని కేంద్రం మధ్య రాష్ట్రంలో చెలరేగుతున్న భాషా వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో తమిళంలో ఇంజనీరింగ్, వైద్య విద్యా బోధన గరపవలసిందిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం కోరారు. ముఖ్యంగా హిందీ భాష ‘నిర్బంధం’పై స్టాలిన్ అభ్యంతరం దృష్టా భాషా సమస్యపై ముఖ్యమంత్రిని అమిత్ షా లక్షం చేసుకుంటూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చిందని, కేంద్ర సాయుధ పోలీస్ దళాల (సిఎపిఎఫ్) అభ్యర్థులు ఇప్పుడు తమ తమ ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయగలిగేలా ప్రభుత్వం చూసిందని వెల్లడించారు.
చెన్నైకి దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో రాణిపేట జిల్లా ఆర్‌టిసి తక్కోళంలో సిఐఎస్‌ఎఫ్ 56వ స్థాపక దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి మాట్లాడుతూ, ‘ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ పరీక్షను తమిళంలో కూడా రాయగలిగేలా చూసింది’ అని చెప్పారు. ‘విద్యార్థుల ప్రయోజనార్థం రాష్ట్రంలో తమిళంలో ఇంజనీరింగ్, వైద్య విద్యా బోధన గరపవలసిందిగా తమిళనాడు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో భాషా వివాదం సాగుతున్న నేపథ్యంలో సిఎం లక్షంగా అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌పి) ద్వారా హిందీని నిర్బంధం చేస్తున్నారని తమిళనాడులోని అధికార డిఎంకె ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణను కేంద్రం ఖండించింది. తాము ద్విభాషా విధానం అంటే తమిళం. ఇంగ్లీష్ భాషలను మాత్రమే అనుసరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇది ఇలా ఉండగా, అమిత్ షా తమిళనాడు కొనియాడుతూ, భారత సాంస్కృతిక రంగాన్ని పటిష్ఠం చేయడంలో ఈ దక్షిణాది రాష్ట్ర సంస్కృతి ప్రధాన పాత్ర పోషించిందని తెలియజేశారు. ‘పరిపాలన సంస్కరణలు, ఆధ్యాత్మిక శిఖరాలు అధిరోహించడం, విద్య లేదా దేశ సమైక్యత, సమగ్రత పరిరక్షణ విషయంలో తమిళనాడు ప్రతి రంగంలో భారతీయ సంస్కృతిని బలోపేతం చేసింది’ అని అమిత్ షా చెప్పారు.
సిఐఎస్‌ఎఫ్ జవాన్ల రమణీయ కవాతు, యోగ ప్రదర్శన, కమాండో కార్యకలాపాలు ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. సిఐఎస్‌ఎఫ్ గురించి అమిత్ షా మాట్లాడుతూ, భారత్‌ను 2047 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం నెరవేరడంలో ఈ దళం తోడ్పాటు అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ‘దేశ పారిశ్రామిక, వాణిజ్య లేదా పరిశోధన సంస్థల అభివృద్ధి విషయంలో సిఐఎస్‌ఎఫ్ జవాన్లు లేకుండా వాటి భద్రతను ఊహించజాలం. సిఐఎస్‌ఎఫ్ తిరుగులేని విధేయత, అంకితభావం ఫలితంగానే ఇప్పుడు దేశం సదరు రంగాల్లో దేశం సురక్షితంగా ముందుకు సాగుతోంది’ అని అమిత్ షా తెలియజేశారు.