Friday, November 22, 2024

ఫ్రాన్స్‌లో ఉపాధ్యాయుని హత్యతో భద్రతా చర్యలు పెంపు

- Advertisement -
- Advertisement -

అరాస్ ( ఫాన్స్): ఉత్తర ఫ్రాన్స్ లో అరాస్ నగరంలోని గాంబెట్టా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడ్ని పూర్వ విద్యార్థి ఒకడు కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటనతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో దేశం మొత్తం మీద విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద , ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలను ప్రభుత్వం పెంచింది. దాదాపు 7000 మంది భద్రతాదళాలను సోమవారం సాయంత్రానికి దేశం మొత్తం మీద రంగం లోకి దింపాల్సిందిగా దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఆదేశించినట్టు అధ్యక్షకార్యాలయం శనివారం ప్రకటించింది. ఈ సంఘటనలో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోగా, మరో టీచర్, సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఇస్లామ్ తీవ్రవాదిగా భావిస్తున్నారు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా దాడికి ఒకరోజు ముందుగానే అంటే గురువారమే నిందితుడిని ప్రశ్నించడానికి అదపు లోకి తీసుకున్నప్పటికీ, దాడికి సిద్ధపడుతున్న సూచనలేవీ కనిపించలేదని అంతర్గత వ్యవహారాల మంత్రి జెరాల్డ్ డెర్మానియన్ వెల్లడించారు.

నిందితుడి అసలు ఉద్దేశమేమిటో తెలియడం లేదని చెబుతున్నారు. ప్రాసిక్యూటర్ల ఎదుట నిందితుడు మాట్లాడడానికి ఒప్పుకోవడం లేదు. పాఠశాల పూర్వ విద్యార్థి అయిన నిందితుడు దాడి చేసినప్పుడు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశాడని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. అయితే ఈ దాడికి హమాస్‌ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడిని ఉగ్రవాద సంబంధ హత్య కేసు కింద శిక్షించడానికి ప్రాసిక్యూటర్లు యోచిస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి స్కూళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద 12 మందిని అదుపు లోకి తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. ఈ వారం యూదులు ఉండే ప్రాంతాల్లో భద్రతను మరింత ప్రభుత్వం పెంచింది. ఇదిలా ఉండగా, శనివారం గాంబెట్టా ఉన్నత పాఠశాలను తిరిగి ప్రారంభించడంతో కొంతమంది విద్యార్థులు, సిబ్బంది పాఠశాలకు వచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌లు పాఠశాల వద్ద రక్షణగా ఉన్నప్పటికీ తరగతుల్లోకి పిల్లలు, పెద్దలు వెళ్లడానికి భయపడడంతో తరగతులను రద్దు చేశారు. కొందరు ధైర్యం చేసి తమ పిల్లలను తీసుకువచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News