సూర్యాపేట: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం పాఠశాలకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అర్బయీన్ సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు ఈరోజు ఉదయం అకస్మాత్తుగా ఐచ్చిక సెలవు రద్దయినట్టుగా ఆలస్యంగా సమాచారం ఇచ్చి ఉపాధ్యాయులందరినీ విధులకు హాజరు కావలసిందిగా ఆదేశించారు.
ఆలస్యంగా సమాచారం అందుకున్న లింగయ్య, కవిత ఉపాధ్యాయ దంపతులు హడావుడిగా పాఠశాలకు వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కవిత ఘటనాస్థలంలోనే మరణించగా, ఆమె భర్త, ఉపాధ్యాయులు లింగయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ లో తరలించారు. మరణించిన ఉపాధ్యాయురాలు కవిత, పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారని, ఇటువంటి అనాలోచిత ఆకస్మిక నిర్ణయాలు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.