Monday, December 23, 2024

ఎక్కాలు నేర్చుకోనందుకు చిన్నారికి ‘దారుణ’ శిక్ష

- Advertisement -
- Advertisement -

లక్నో: హోమ్‌వర్క్ చేయనందుకు ఓ విద్యార్థిని తోటి విద్యార్థుల చేత కొట్టించారు ఓ ఉపాధ్యాయురాలు. ఎక్కాలు నేర్చుకోలేదని ఆ శిక్ష విధించారు. ఆ విద్యార్థిని వేధించిన వీడియో వైరల్ కావడంతో అమానుషంగా ప్రవర్తించిన ఆ టీచర్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న దృశ్యాల ప్రకారం .. ఒకటో తరగతి చదువుతున్న బాలుడు చెప్పిన హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ తోటి విద్యార్థులతో కొట్టించారు. మధ్యలో సెలవు వచ్చినా ఎక్కాలు నేర్చుకుని రాలేదని కోపగించుకుంటూ ఆ బాలుడిని గట్టిగా కొట్టాలని తోటి విద్యార్థులకు చెప్పారు. కాగా ఆ విద్యార్థి ముస్లిం కావడం, ఉపాధ్యాయురాలు ముస్లిం తల్లిదండ్రుల గురించి కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కాగా ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు.‘ మా అబ్బాయికి ఏడు సంవత్సరాలు.

మా కుమారుడ్ని టీచర్ పదేపదే కొట్టించారు. ఏదో పనిమీద స్కూలుకు వెళ్లిన మా బంధువు ఆ వీడియో తీశాడు. నా కుమారుడ్ని గంటకు పైగా వేధించారు’ అని ఆ బాలుడి తండ్రి వెల్లడించాడు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడామని, ఆ టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా ఈ ఘటనపై తృప్త త్యాగి అనే ఆ టీచర్ మీడియాతో మాట్లాడుతూ, ‘చదువు విషయంలో పిల్లాడితో కఠినంగా ఉండాలని అతని తల్లిదండ్రులే నాతో ఒత్తిడి చేసే వారు. నేను దివ్యాంగురాలిని కావడంతో ఇతర విద్యార్థులకు చెప్పి దెబ్బలు కొట్టించాను. ఆ చిన్నారి బంధువు తీసిన వీడియోను వక్రీకరించారు’ అని తన చర్యను సమర్థించుకున్నారు. అంతేకాదు విద్యార్థులంతా తనపిల్లల్లాంటి వాళ్లేనని కూడా ఆమె చెప్పారు. ఇదిలా ఉంటే విద్యార్థి తల్లిదండ్రులు మొదట కేసు పెట్టడానికి నిరాకరించారని, కానీ ఈ రోజు (శనివారం) స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని జిల్లా మేజిస్ట్రేట్ అరవింద్ బంగారీ వెల్లడించారు.

రాజకీయ దుమారం
కాగా ఈ సంఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మత విద్వేషాలను, వివక్షను వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. అమాయక చిన్నారుల్లో మత విద్వేషపు బీజాలను నాటడం, పాఠశాలలాంటి పవిత్ర స్థలాన్ని విద్వేషాల మార్కెట్ స్థలంగా మార్చడం దారుణం. ఒక టీచర్ భారత దేశానికి ఇంతకన్నా దారుణం మరోటి లేదు’ అని ఆయన తన ట్వీట్‌లో మండిపడ్డారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఆ టీచర్‌ను సమాజానికి మాయని మచ్చగా అభివర్ణిస్తూ ఆమెను తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి తదితర పార్టీలు సైతం ముజఫర్ నగర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, సమాజంలో మత విభేదాలు సమాజంలోని అట్టడుగు వర్గాలు, మైనారిటీలపై హింసను ఎలా ప్రేరేపిస్తాయో చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అని పేర్కొన్నాయి. కాగా ఈ సంఘటనను సినీ రంగానికి చెందిన ప్రముఖులు సైతం తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బాలీవేడ్ సినీ రచయిత జావేద్ అఖ్తర్, నటులు రేణుక సహానే, ప్రకాశ్ రాజ్‌లు ఆ ఉత్తరప్రదేశ్ టీచర్‌పై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటి స్వస్తికా ముఖర్జీ, వరుణ్ గ్రోవర్ తదితరులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News