Monday, December 23, 2024

నేడు టీచర్ ఎంఎల్‌సి ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నిక కోసం 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్‌కర్నూల్ 14, వనపర్తిలో 7, జోగులాంబ గద్వాల్‌లో 11, నారాయణపేట్‌లో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ 18, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా 11 అదనపు పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు.

ఈ ఎంఎల్‌సి స్థానానికి మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. హైదరాబాద్- -రంగారెడ్డి– మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎంఎల్‌సి నియోజకవరగంలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 29,720 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.వీరిలో 15,472 మంది పురుషులు, 14,246 మంది స్త్రీలు, ఇతరులు ఇద్దరు ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లకు తాగునీరు, టెంట్లు ఏర్పాటు, వికలాంగుల కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. రిసెప్షన్ సెంటర్‌ను సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నునే వాడాలి

ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలో ప్రాధాన్య పద్ధతిలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య ఓటు ద్వారా తమ మద్దతు తెలియజేయవచ్చు. పోటీ చేస్తున్న వారిలో కేవలం ఒక్కరికి లేదా ఒకరి కంటే ఎక్కువ మందికి లేదా పోటీలో ఉన్న వారందరికీ ఓటు వేయవచ్చు. అయితే అందరికీ ఒకేలా కాకుండా.. ప్రాధాన్య క్రమంలో అంకెల రూపంలోనే ఓటు వేయాలి. ఈ బ్యాలెట్ పత్రంపై నోటా గుర్తు కాలమ్ ఉండదు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేదా భారత ఎన్నికల సంఘం ధ్రువీకరించిన ఇతర పత్రాలను చూపడం ద్వారా ఓటు వేయొచ్చు. మహబూబ్‌నగర్ రంగారెడ్డి హైదరాబాద్ టీచర్ ఎంఎల్‌సికి 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి 11 సీరియల్ నంబరులో ఉంటే అతని పేరు పక్కన 1 అంకె వేయాలి. అలాగే రెండవ ప్రాధాన్యమిచ్చే అభ్యర్థి 15 నంబరులో ఉన్నాడనుకుంటే.. ఆ పేరు పక్కన 2 వేయాలి. మూడో ప్రాధాన్యమిచ్చే వ్యక్తి ఏ నెంబరులో ఉంటే ఆ నెంబరులో అతని పేరు పక్కన 3 వేయాలి. ఇలా బ్యాలెట్‌పై ఎంతమందికి ఇష్టముంటే అంతమందికీ ప్రాధాన్య క్రమంలో ఓటు వేయవచ్చు. ఈ క్రమంలో మధ్యలో అంకెను మిస్ చేయవద్దు. ఇలా చేస్తే ఎక్కడివరకైతే సక్రమంగా ప్రాధాన్యత ఇచ్చారో అక్కడివరకే ఓట్లు చెల్లుతాయి.

ఇలా వేస్తే ఓట్లు చెల్లుబాటవుతాయి..

– ప్రాధాన్యాలను 1, 2, 3.. ఇలా అంకెలలో మాత్రమే వేయాలి
– ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యమే ఇవ్వాలి
– బ్యాలెట్‌లో ఉన్నవారిలో ఒక్కరికి మాత్రమే తొలి ప్రాధాన్యం(1) ఇవ్వాలి.
– బ్యాలెట్‌లో ఉన్నవారికి ఒకరి కంటే ఎక్కువ మందికి కూడా ప్రాధాన్య ఓటు వేయవచ్చు.
– బ్యాలెట్‌లో ఉన్నవారందరికీ ప్రాధాన్యమిస్తూ వారి పేర్ల పక్కన సంఖ్య రూపంలో ఓటు వేయవచ్చు.
– అభ్యర్థి పేరు, ఫొటో పక్కన గడి లోపలనే లేదా బార్డర్‌లు దాటకుండా సంఖ్య వేయాలి.
– 1, 2, 3… లేదా రోమన్ అంకెలలోనూ ఓటు ప్రాధాన్యం తెలియజేయవచ్చు.
– పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్ను/స్కెచ్ ద్వారానే అంకెలు వేయాలి.

ఇలా వేస్తే ఓట్లు చెల్లవు..

– బ్యాలెట్ పత్రంపై వేలిముద్ర, సంతకం, పేర్లు, ఇతర రాతలు.
– రైట్ గుర్తు, తప్పు గుర్తు వంటి గుర్తులు వేయడం.
– మొదటి ప్రాధాన్యం ఇవ్వకుండా, 2, 3 ప్రాధాన్యాలు ఇవ్వడం. మధ్యలో అంకెలు వదలడం.
– ప్రాధాన్యాలను అక్షరాల్లో రాయడం, కొన్నింటిని అంకెలలో, మరికొన్నింటిని అక్షరాల్లో రాయడం.
– ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇవ్వడం
– సొంత పెన్ను. పెన్సిల్‌తో అంకెలు వేయడం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News