Monday, March 3, 2025

నేడే ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 27వ తేదీన జరిగిన ఒక గ్రాడ్యుయేట్,రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానంతో పాటు మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ -కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు పోలైన ఓట్లను సోమవారం(మార్చి 3) లెక్కించనున్నారు.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ మూడు ఎంఎల్‌సి స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గెలుపు గుర్రాలు ఎవరనేది సోమవారం తేలనుంది. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికను బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలను ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు వేసే విధానంతోపాటు ఓట్ల లెక్కింపు విధానంతోనూ ఎంతో విభిన్నత ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో అయితే ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజేతగా ప్రకటిస్తారు. కానీ ఎంఎల్‌సి ఎన్నికల్లో ప్రాధాన్యత ఓట్ల విధానంలో ఫలితాలు ఎప్పుడు, ఎటు మారతాయో చెప్పడం కష్టం. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు అధికంగా వచ్చే వరకు లెక్కింపు కొనసాగిస్తారు. ఆ తర్వాతనే విజేతను ప్రకటిస్తారు.

ఓట్ల లెక్కింపు సాగుతుంది ఇలా…

ఓటర్లు ప్రాధాన్యత క్రమంలో తమ హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో లెక్కింపు కూడా అదే ప్రాతిపదికన చేపడతారు. పోటీ చేసే అభ్యర్థులందరికీ ఒక్కో ఓటరుకు 1,2,3,4,5…పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉంటే ఆ సంఖ్య వరకు అంకెల్లో ప్రాధాన్యతలను ఇస్తూ ఓటు హక్కు వినియోగించుకునే విధానం అమలులో ఉంటుంది. ఆయా ఎంఎల్‌సి నియోజకవర్గాలలో పోలైన ఓట్లలో చెల్లుబాటు అయిన 50 శాతం ఓట్లు దాటిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏ అభ్యర్ధికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50 శాతం ఓట్లు అధిగమించకపోతే ఎలిమినేషన్ పద్ధతిలో ఓట్లు లెక్కిస్తారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అందరి కంటే తక్కువ వచ్చిన వారిని రౌండ్ల వారీగా ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.

ఈ విధంగా ఎలిమినేట్ అయిన అభ్యర్థుల్లో 2వ,3వ, 4వ, 5వ, 6వ, తదితర ప్రాధాన్యత ఓట్లను పరిగణలోనికి తీసుకుంటూ ఏ అభ్యర్థి ప్రప్రథమంగా 50 శాతం ఓట్లు అధిగమిస్తే అతడిని విజేతగా ప్రకటిస్తారు. ఒక వేళ ఏదైనా రౌండ్‌లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తే వారిలో ఆధిక్యత ప్రాతిపదికన విజేతను నిర్ణయిస్తారు. ఒక వేళ ఎలిమినేషన్ పద్ధతిలో చివరి వరకు ఏ అభ్యర్థి కూడా 50 శాతం ఓట్లు అధిగమించకపోతే చివరికి మిగిలిన ఇరువురు అభ్యర్థుల్లో మెజారిటీ ఓట్లు పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యతా ఓట్లతో ఎవరికీ 50 శాతం కన్నా ఒక ఓటు ఎక్కువ రాకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతారు. అప్పుడు రెండవ రౌండ్ లెక్కింపు మొదలవుతుంది.

ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువ వచ్చిన అభ్యర్థిని తొలుత ఎలిమినేట్ చేస్తారు. ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారో గుర్తించి ఆయా అభ్యర్థులకు ఆ ఓట్లను బదలాయిస్తారు. రెండవ రౌండ్‌లో ఎవరికీ 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అప్పటికీ ఫలితం తేలకపోతే మొదటి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండవ అభ్యర్థిని తొలగించి అతడి బ్యాలెట్ పత్రంలో ఇతర అభ్యర్థులకు వచ్చిన రెండవ ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించి అభ్యర్థిని వచ్చిన మూడవ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల ఓట్లలో కలుపుతారు. ఇలా ఎవరైనా అభ్యర్థికి 50 శాతం+1 ఓటు వచ్చే వరకు అభ్యర్థులను తొలగిస్తూ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. లేదంటే ఒక అభ్యర్ధి మిగిలే వరకు ఈ లెక్కింపు కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News