Monday, December 23, 2024

విద్యార్థుల సంఖ్య నిష్పత్తి మేరకు టీచర్ పోస్టులు ఉండాలి

- Advertisement -
- Advertisement -

రేషనలైజేషన్ విధానమే పరిష్కార మార్గం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్


మనతెలంగాణ/ హైదరాబాద్ : పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మేరకు టీచర్ పోస్టులు ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. టీచర్ పోస్టుల హెచ్చు తగ్గుల సమస్యకు రేషనలైజేషన్ విధానమే పరిష్కార మార్గం అని, అందుకు ప్రజా ప్రతినిధులు,ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ప్రైమరీ, హై స్కూల్స్‌ను వినోద్‌కుమార్ సందర్శించారు.

మన ఊరు..- మనబడి కార్యక్రమంలో భాగంగా నర్సింగాపూర్ పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఆ గ్రామంలోని పాఠశాలలలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎంత..?, బోధిస్తున్న టీచర్ల సంఖ్య ఎంత..? అనే విషయంపై వినోద్ కుమార్ ఆరా తీయగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. విద్యార్థుల నిష్పత్తి సంఖ్య కన్నా, ఉపాధ్యాయుల నిష్పత్తి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితి దాదాపుగా అనేక పాఠశాలల్లో నెలకొన్నట్లుగా విషయం వినోద్ కుమార్ కు అర్థమైంది. నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉండటం, హై స్కూల్‌లో ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉండటం వినోద్ కుమార్ దృష్టికి వచ్చింది. వెంటనే రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ దేవసేనకు ఫోన్ చేసిన వినోద్‌కుమార్.. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు రేషనలైజేషన్ విధానాన్ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.

పాఠశాలల్లో రేషనలైజేషన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని, అప్పుడే విద్యార్థుల సంఖ్య నిష్పత్తి మేరకు ఉపాధ్యాయుల సంఖ్య నిష్పత్తి పోస్టింగ్స్‌కు అవకాశం ఉంటుందని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం విద్యాబోధన జరుగుతున్న తీరును డిఇఓ రాధాకిషన్, జిల్లా పరిషత్ సిఈవో గౌతమ్‌రెడ్డితో కలిసి వినోద్‌కుమార్ విశ్లేషించారు. కార్యక్రమంలో ఎంపిపి వేణుగోపాల్, జడ్పిటిసి సభ్యులు కత్తెరపాక ఉమాకొండయ్య, నర్సింగాపూర్ సర్పంచ్ జోగినపల్లి ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News