హైదరాబాద్ : విద్యార్థులలో నైతిక విలువలు, దేశభక్తి భావాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రెండు రోజుల శిక్షణా తరగతులు ఘట్కేసర్ లోని ఆర్ వి కె అన్నోజిగూడలో ఉపాధ్యాయులకు నూతన జాతీయ విద్యా విధానం, ప్రాచీన భారతీయ చరిత్ర, ఉన్నత సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, వివిధ సర్వీస్ నిబంధనలు వంటి అంశాలపై ప్రముఖుల చేత శిక్షణ నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని విద్యార్థుల లో నైతిక విలువలను దేశభక్తి భావాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. దేశం ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో ఉన్నత వ్యక్తిత్వం గల విద్యార్థులను తయారు చేయాలని ఆయన కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగం పట్ల నిర్లక్షం చేయవద్దని సూచించారు. విద్యారంగంలో పలు ఖాళీలు భర్తీ కాకుండా అనేక ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ఉపాధ్యాయుల సమస్యలు ఏవీ కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో జీతాలు రాకపోవడంతో పాటు అనేక రకమైన పెండింగ్ బిల్లులు మంజూరు కాకుండా ఉన్నాయన్నారు.
బదిలీలు పదోన్నతులు న్యాయ వివాదాలు లేకుండా నిర్వహించడానికి తగిన చొరవ తీసుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మన ఊరు- మనబడి పనుల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదని అన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం ఒక స్కావెంజర్‌ను నియమించకపోవడం బాధకరమన్నారు. త్వరలోనే హైదర్ గూడా లోని తన క్వార్టర్ లో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తున్నానని, క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న విద్యారంగ ఉపాధ్యాయుల పెండింగ్ అప్పిల్లను స్వీకరించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశాలకు జాతీయ సహ సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్, పాలేటి వెంకట్రావు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.