ఉపాధ్యాయులు తమ రాజకీయ అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకోవచ్చునా? కూడదా? ఎవరికి ఓటు వేయాలో, ఎవరికి వేయకూడదో ఒక టీచర్ తన విద్యార్ధులకు చెప్పవచ్చునా? ప్రొఫెసర్ సబ్యసాచి దాస్‌ను అశోక విశ్వవిద్యాలయం నుంచి, కరణ్ సంగ్వాన్‌ను అన్ అకాడమీ నుంచి తొలగించడంతో ఈ చర్చ మరోసారి మొదలయ్యింది. ఒక టీచరు తన వ్యక్తిగత అభిప్రాయాలను ముఖ్యంగా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చునా? ఆ వ్యక్తిగత లేదా రాజకీయ అభిప్రాయాలకు వారి పాండిత్యానికి సంబంధం లేదా? ఉపాధ్యాయులకున్న అభిప్రాయాల వల్ల వారిపై దాడులు జరుగుతున్న దేశంలో, వారిని అరెస్టు చేస్తున్న సమయంలో ఈ ప్రశ్న తలెత్తుతున్నది. ఒకవంక గురుపూజోత్సవం పేరిట గురువులకు దండలు వేస్తూ మరోవంక వారి అభిప్రాయాలకు అరదండాలు తగిలిస్తున్న దశలో ఈచర్చలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని విమర్శించే తన పరిశోధనా పత్రంలోని కొన్ని విషయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అశోకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సబ్యసాచి దాస్ ఆగస్టు ప్రథమార్థంలో రాజీనామా చేయవలసి వచ్చింది.
విశ్వవిద్యాలయం, ఈ ప్రొఫెసర్‌ను బహిరంగంగా ఖండించడమే కాకుండా, తమ అధ్యాపకులు సోషల్ మీడియాలో క్రియాశీలంగా వుండటం తమ కిష్టం లేదని ప్రకటించింది. అయితే బోధన, పరిశోధనల్లో తమ ఎంపికల గురించి ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొంది. మీడియాలో ప్రచురితమైన తన అభిప్రాయాలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ప్రతాప్ భాను మెహతా 2021లో ఇదే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు. మెహతా పాండిత్యంపట్ల తమకు చాలా గౌరవం ఉన్నప్పటికీ ఆయన రాజకీయ అభిప్రాయాలు విశ్వవిద్యాలయం పని తీరును దెబ్బ తీసే అవకాశం ఉందని విశ్వవిద్యాలయం తెలిపింది. ఇటీవల, ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్ అన్ అకాడమీలో లా ఎడ్యుకేటర్‌గా పని చేస్తున్న కరణ్ సంగ్వాన్; ఇన్‌స్టిట్యూట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అతనిని సంస్థ తొలగించింది. భారత శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ల గురించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులపై సంగ్వాన్ ఒక క్లాసులో మాట్లాడుతూ -చదువుకున్న నాయకులకు ఓటు వేయాలని విద్యార్థులను కోరారు.
పర్యవసానాల గురించి ఆలోచించి, నిర్ణయాలు సవ్యంగా తీసుకునే నాయకులనే ఎన్నుకోవాలని ఆయన అన్నారు. దీని కోసం ఆయనను తొలిగించారు. ఈ సంఘటన రెండు ప్రశ్నల చుట్టూ చర్చకు దారి తీసింది. విద్యావంతులకే ఓటు వేయాలని సూచించడం సబబేనా? వివేకానికి, అక్షరాస్యతకు ప్రత్యక్ష సంబంధం లేదని మనకు తెలుసు. డిగ్రీ లేనివాడు చదువుకోలేదనడం పొరపాటే. వివేకవంతమైన, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోగలిగినవాడే నాయకుడు కావాలి. స్వాతంత్య్రానంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కుమారస్వామి కామరాజ్ కు ఎలాంటి నియమిత విద్య లేదు. కానీ ఆయన సమర్థవంతమైన, విజయవంతమైన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో బడికి వెళ్లే పిల్లల సంఖ్య 7% నుంచి 37 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదటగా ఆయనే ప్రారంభించారు. జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి తన ఇతర సమకాలీకుల మాదిరిగా కామరాజ్ ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చునని, అయినప్పటికీ తమిళనాడుకు అత్యంత సమర్థవంతమైన పాలనను అందించారని వ్యాఖ్యానించారు.
కామరాజ్ ను విద్యావంతుడు అంటారా లేదా? విద్య అంటే కేవలం అక్షరాస్యత ఆధారిత విద్య మాత్రమే కాదు. ఇలాంటి చర్చ ఒకటి వచ్చింది. రెండవ ముఖ్యమైన చర్చ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓటు ఎలా వేయాలో చెప్పాలా అనే దాని గురించి. ఉపాధ్యాయులు తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేయాలా వద్దా? అధ్యాపకులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను విద్యార్థులకు వెల్లడించకూడదని అశోక విశ్వవిద్యాలయం లేదా అన్‌అకాడమీ చెబుతోంది. నాణ్యమైన విద్యను అందించడమే వారి పని అంటోంది. పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు సులభంగా ఆకట్టుకుని వారిని ప్రభావితం చేయగలరని అనేక మంది నమ్ముతారు. ఉపాధ్యాయుడు తన అభిప్రాయాన్ని విద్యార్థిపై రుద్దకూడదు అనేది సాధారణంగా ఉన్న అభిప్రాయం. కానీ దీన్ని భిన్నంగా చూడండి. ఉపాధ్యాయుడు ఒక అభిప్రాయాన్ని ఒక విద్యార్థి ముందు వ్యక్తం చేసినప్పుడు, చర్చించినప్పుడు విద్యార్థి ఒక విధమైన సమానత్వ భావనను పొందుతాడు. ఉపాధ్యాయుడు- విద్యార్థి ఇద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి సమాన అవకాశాన్ని కలిగి ఉండటం కూడా అవసరం.
విద్యార్థి ఉపాధ్యాయుడి ముందు మౌనంగా ఉండే అవకాశం ఉంది, కానీ ఉపాధ్యాయుడితో విద్యార్థి తన అసమ్మతిని వ్యక్తం చేసేంత ఆత్మవిశ్వాసం కల్పిస్తే, ఉపాధ్యాయుడు చొరవతో తరగతి గదిలో అటువంటి వాతావరణాన్ని సృష్టించినట్లయితే అది ఆరోగ్యకరమైన చర్చను కూడా ప్రారంభిస్తుంది. భిన్నాభిప్రాయాలను ఎలా ఎదుర్కోవాలి, భిన్నాభిప్రాయాలతో ఎలా వ్యవహరించాలి అనేది కూడా మనం నేర్చుకునే లేదా బోధించే విషయం.ఒక ఉపాధ్యాయుడు తన రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే, అది విద్యార్థులను అనుచిత రీతిలో ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లవుతుందా? పాఠశాలలు, కళాశాలల్లో భిన్న రాజకీయ భావాలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు ఈ విభిన్న అభిప్రాయాలను పోల్చి, వారి స్వంత అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. క్రమశిక్షణ, తరగతి పట్ల ఆయనకున్న శ్రద్ధ కారణంగా ఒక మంచి ఉపాధ్యాయుడి అభిప్రాయానికి ఇతరులకన్నా ఎక్కువ విలువ ఉంటుందనేది కొంతవరకు నిజం. కానీ విద్యార్థులను ప్రభావితం చేయడం అంతసులభం కాదు. తరగతి గదిలో నిష్పాక్షికంగా బోధించాలనేది భారత దేశలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులలో
చర్చనీయాంశంగా ఉంది. ఉదాహరణకు అమెరికాలో బైబిల్ చెప్పిన దానికి భిన్నంగా బోధించడం ఒక ఉపాధ్యాయుడికి కష్టతరమైనది మరి సైన్స్ తరగతిలో భూమి సృష్టి లేదా పరిణామ సిద్ధాంతంపై చర్చ సందర్భంగా ఉపాధ్యాయుని నిష్పాక్షికత ఎలా వుంటుంది? దాని అర్థం ఏమిటి? ఒక ఉపాధ్యాయుడు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసినప్పుడే ఆయన రాజకీయ భావజాలం విద్యార్థులకు తెలుస్తుందనేది కూడా ఒక అపోహనే. ఉపాధ్యాయులు బోధించే తీరును బట్టి వారి వైఖరులను విద్యార్థులు ఊహించుకోగలరు. రచయితల ఎంపిక, గ్రంథాలు, సిలబస్ వగైరా విద్యా వ్యవస్థ తీరుని నిర్ణయిస్తాయి. కానీ విద్యార్థుల అభిప్రాయాల రూప కల్పనలో ఉపాధ్యాయునికి లేదా ఒక విద్యాసంస్థకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నాము. ఉపాధ్యాయులు సిలబస్‌కు భిన్నంగా బోధించలేరు. విద్యార్థులు- వారి కుటుంబం, స్నేహితులు, విస్తృత సమాజం బహుళ ప్రభావ రంగాలలో జీవిస్తున్నారనే విషయాన్ని మనం మరచిపోతాము. ఉపాధ్యాయులు సర్వం కాదు. విద్యార్థి చుట్టూ వున్న ఈ విశ్వంలో వారు ఒక భాగం మాత్రమే. అయితే ఒక మంచి ఉపాధ్యాయుడి అభిప్రాయానికి ఇతరులకన్నా ఎక్కువ విలువ ఉంటుందనేది కొంత వరకు మాత్రమే నిజం. ఈ సమస్య తల్లిదండ్రులకు,
సమాజానికి ఉన్నంతగా విద్యార్థుల్లో లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బిడ్డ దారితప్పి పోతుందేమోనని తల్లిదండ్రులు ఎక్కువగా భయపడుతున్నారు. విద్యాసంస్థ లేదా ఉపాధ్యాయుడు కూడా తల్లిదండ్రుల, సామాజిక ఆమోదం పొందిన అభిప్రాయాలను, వారి పక్షపాతాలను ధ్రువీకరించాలని కోరుకుంటున్నారు. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించే బోధనను కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. విద్యార్ధులను విధేయులుగా మార్చాలనే వారు అభిలషి స్తున్నారు. పిల్లలకు స్వంత ఆలోచన కలిగేలా ఏదీ చేయకూడదు లేదా చెప్పకూడదు అనుకుంటున్నారు. ఉదాహరణకు రామ కథను తీసుకుందాం. భారత దేశంలో విస్తృతంగా వినిపించే రామ కథలో, వివిధ కవులు సృష్టించిన రాముడి విభిన్న రూపాలు, ఆలోచనల గురించి పిల్లలతో మాట్లాడాలా? వద్దా? ప్రచారంలో వున్న దానికి భిన్నంగా వున్న వెర్షన్లను గురించి చెప్పాలా? వద్దా? వివిధ వెర్షన్ల గురించి టీచర్ తన స్వంత అభిప్రాయాన్ని వారికి చెప్ప కూడదా? ఒక పద్యాన్ని బోధించేటప్పుడు, దాని గురించి వివిధ విమర్శకుల అభిప్రాయాలను విద్యార్థులకు తెలియజేయడం అవసరం కాదా?
కొన్నిసార్లు విద్యార్థులు పద్యం గురించి మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోవచ్చు. కవిత పై మీ స్వంత అభిప్రాయాన్ని లేదా మూల్యాంకనాన్ని వారితో పంచుకోకపోవడం సబబేనా? మీరు మీ అభిప్రాయాన్ని పంచుకున్నప్పుడు, విద్యార్థులు దానిని వారి పద్ధతిలో మూల్యాంకనం చేయవచ్చు. మీ అభిప్రాయాలను తిరస్కరించ వచ్చు రాజకీయాల విషయంలో ఇది మరింత నిజం. మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం ద్వారా చర్చను ప్రారంభించవచ్చు, మీ సమీక్షను పోటీ ఆలోచనలతో పోల్చడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వవచ్చు. ఉదాహరణకు, కరణ్ సంగ్వాన్ తన అభిప్రాయం చెప్పిన తరువాత, ప్రజాస్వామ్యంలో నాయకులకు విద్య అర్హత అవసరం గురించి అతని విద్యార్థులు అతనితో వాదించవచ్చు. ఎవరైనా కామరాజ్ ఉదాహరణ తీసుకుని అతని అభిప్రాయాన్ని ఖండించవచ్చు. సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అన్ అకాడమీ చేత తొలగించబడిన లా ఎడ్యుకేటర్ కరణ్ సంగ్వాన్ కేవలం విద్యావంతులైన నాయకులకు ఓటు వేయమని విద్యార్థులను కోరినప్పుడు ఉపాధ్యాయుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ కరణ్ సంగ్వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోతే, అతను తన వృత్తిలో నిజాయితీగా లేనట్లే. అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆయన హక్కు
. అది ఆయన కర్తవ్యం కూడా. తమ గురువు అభిప్రాయం తెలుసుకోవడం కూడా విద్యార్థుల హక్కు. అధ్యాపకుల అభిప్రాయాలను విద్యార్థులు పూర్తిగా అంగీకరిస్తారని చెప్పలేము. ఒక దేశంలో లేదా సమాజంలో ఉపాధ్యాయులు తమ జ్ఞాన హక్కును ఉపయోగించేటప్పుడు వారి నిష్పాక్షికతను విడిచిపెట్టే కొన్ని అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ మొదటి అభ్యర్థిత్వం సమయంలో అమెరికన్ మనస్తత్వవేత్తలు ట్రంప్ గురించి తమ అభిప్రాయాన్ని దేశ ప్రజలకు చెప్పారు, ఎందుకంటే వారి వృత్తిపరమైన అభిప్రాయంలో ట్రంప్ దేశానికి ప్రమాదకరం. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా పరిశీలించకుండా అతని గురించి అభిప్రాయం ఇవ్వకూడదని తమ వృత్తి (గోల్ వాటర్ రూల్) పరిమితి ఉన్నప్పటికీ తాము ఈ అభిప్రాయాన్ని ఇస్తున్నట్లు వారు చెప్పారు. అమెరికన్ సైకో అనలిటికల్ అసోసియేషన్ తన సభ్యులకు ట్రంప్ లేదా ఇతర రాజకీయ నాయకుల మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా చర్చించే అవకాశం ఇచ్చింది. గోల్ వాటర్ రూల్‌ను పక్కన పెట్టింది. ట్రంప్ అభ్యర్థిత్వం సృష్టించిన అసాధారణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
జ్ఞానం కూడా ఒక బాధ్యతే అని భావించారు. అయితే వోటర్లు వారి హెచ్చరికను పట్టించుకోలేదు. అదే విధంగా ఒక నాయకుడు పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి బాధ్యతారహిత నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదా నాలుగు గంటల వ్యవధిలో దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు, దాని వల్ల దేశంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారినప్పుడు, ఒక ఉపాధ్యాయుడు తన నిష్పాక్షికతను విడిచిపెట్టి, అటువంటి చర్యలు దేశానికి ఎందుకు హానికరమో విద్యార్థులకు చెప్పాలి. ఉపాధ్యాయ వృత్తి మనుగడకు కూడా ఇలాంటి సంభాషణ అవసరం.