Saturday, November 16, 2024

రాజకీయ ఒత్తిళ్లతోనే టీచర్లను సస్పెండ్ చేయడం సరికాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి క్షేత్రస్థాయిలో విచారణ జరిపకుండానే జిల్లా కలెక్టర్ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేయడం అన్యాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కుట్రలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి నిరాదరమైన ఆరోపణలతో టీచర్లను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డీఈవో ఎమ్మెల్యే చేతిలో కీలు బొమ్మలుగా మారారన్నారు. దిందా వాగు పరిశీలనకు వెళ్లినప్పుడు వాగు దాటలేక ఉపాధ్యాయులు తమ సమస్యలు వివరించినట్లు తెలిపారు. దిందా వాగు దాటుతూ ఎంబీఏ విద్యార్థి రామకృష్ణ చనిపోయి, 8 ఏళ్లు గడిచిన బ్రిడ్జి నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి ఆంధ్ర నుంచి వలస వచ్చిన కోనప్ప వచ్చే ఎన్నికల్లో ఓడించి తిరిగి ఆంధ్రకు పంపాలన్నారు. అధికారం అండతో బీఎస్పీ కార్యకర్తలను బెదిరిస్తూ, అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చింతలమానేపల్లి కేజీబివి పాఠశాలలో బాలికలకు కనీస సౌకర్యాలు కల్పించలేని చేతగాని దద్దమ్మ ఎమ్మెల్యే అని అన్నారు. నియోజకవర్గంలొని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.ఆదివాసీ బిడ్డలు ఆసుపత్రికి వెళ్లాలంటే చావే శరణ్యమని అన్నారు. జనాభాలో 52 శాతం ఉన్నవాళ్ళకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఐదు శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ హాయంలోనే బాబ్రీ మసీద్ కూలిపోయిందన్న ఆయన ముస్లిం మైనారిటీలు ఇంతకాలం కాంగ్రెస్ కు ఎందుకు ఓట్లేశారో ఆలోచించాలన్నారు.

మణిపూర్‌లోని ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన బిజెపికి వచ్చే ఎన్నికల్లో ఆదివాసీలు ఓట్లు వేయొద్దన్నారు.
ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూనిర్వాసితులు పక్క ఇండ్లు లేక రేకుల షెడ్డుల్లో జీవిస్తున్నారన్నారు. నేను ఉపాధి హామీ కూలీ బిడ్డనేనన్న ఆయన పేదల బతుకులు మార్చేందుకే సిర్పూర్ నుంచి అసెంబ్లీ బరిలో ఉంటున్నట్లు తెలిపారు. డా.బి.ఆర్ అంబేద్కర్ ను నాడు కాంగ్రెస్ ఓడిస్తే జోగేంద్రనాథ్ మండల్ పదవీ త్యాగంతో బెంగాలీ ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇక్కడి బెంగాలీ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్,జిల్లా ఇంచార్జులు సిడెం గణపతి,సోయం చిన్నయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా కోశాధికారి నవీన్,జిల్లా మైనారిటీ నాయకులు ముఖతీయర్,కౌటాల అధ్యక్షులు వెంకటేష్,కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు నక్క మనోహర్, శోభన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News