Sunday, December 22, 2024

ఈనెల 3వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలు

- Advertisement -
- Advertisement -

తగిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు
బదిలీలు పారదర్శకంగా, అపోహలకు తావులేకుండా చేపట్టాలి
న్యాయస్ధానం తీర్పుకు లోబడి నిర్వహించాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 3వ తేదీ నుంచి టీచర్ల బదిలీలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. న్యాయస్ధానం వివాదాలతో కొన్ని నెలలుగా నిలిచి పోయిన ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో బదిలీలను అక్టోబర్ 3వ తేదీవరకు పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. అందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఎస్‌సిఈఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవలసిందిగా విద్యాశాఖ తరపున వ్యక్తిగతంగా మెసేజ్ లు పంపాలని ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టీఎస్ ఆన్లైన్ అధికారులను సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కోరారు. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్యా సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News