Monday, December 23, 2024

అడ్‘మిషన్ 2023’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా అడ్మిషన్లు తీసుకురావాలంటూ యాజమాన్యాలు నిబంధన విధిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలపై ఇప్పటి నుంచే టార్గెట్లు విధిస్తున్నాయి. పిల్లలను చేర్పిస్తేనే కొలువు ఉంటుందని లేకుంటే, ఉద్యోగానికి భరోసా ఇవ్వమని యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తమ కొలువులు ఉం టాయో, ఊడుతాయో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయు లు ఇంటింటికి వెళ్లి అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. బోధనతోపాటు అదనపు తరగతులు నిర్వహిస్తూనే సెలవు రోజులు, ఆదివారాలలో పాఠశాల అడ్మిషన్ల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల ద్వారా తమ ఇంటి వద్ద ఇరుగుపొరుగు వారు, బంధువుల ఇళ్లల్లో ఉండే పిల్లల సమాచారం తెలుసుకుని అడ్మిషన్లు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. తెలిసిన వాళ్ల ద్వారా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ లాగా ఇంటింటికి తిరుగుతూ అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పరిస్థితుల్లో ఫీజులు చెల్లించలేక తమ పిల్లలను ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్‌లో చేర్పించేందు కే మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ కాలంలో ఆన్‌లైన్ తరగతు లే నిర్వహించారు కాబట్టి ఎక్కడైనా ఒకటే అని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటి పిల్లల సమాచారం తెలుసుకుని అడ్మిషన్లు చేయడంపై ప్రైవేట్ టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో జనవరి నెల ముగియనుండగా, మరో నెల రోజుల్లో అంటే మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తా రు. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన వివరాలు సేకరిస్తే వేసవి సెలవుల్లో అడ్మిషన్లు చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ప్రైవేట్ పాఠశాలలో పని చేసే టీచర్లకి యాజమాన్యాలు ఇచ్చే వేతనం అరకొర మాత్రమే. ప్రాథమికస్థాయి విద్యాబోధనకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు.

హైస్కూల్ అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. డిగ్రీ, పిజిలతో పాటు బిఇడి, ఎంఇడిలుచదివి కష్టపడి పాఠాలు బోధించి విద్యార్థులకు ర్యాంకులు సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చిపెడుతున్న టీచర్లు సరైన వేతనాలు లేకుండానే పని చేస్తున్నారు.
టార్గెట్ పూర్తి అయితేనే ఉద్యోగం
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు యాజమాన్యాలు ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే ఇంటికి పంపిస్తామని యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. అడ్మిషన్లు తెచ్చిన వారికి వేసవి సెలవుల్లో రెండు నెలల జీతం ఇస్తామని కొన్ని బడా ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు విధిస్తున్నాయి. ప్రతి టీచర్ కనీసం ఐదు అడ్మిషన్లు తేవాలని చెబుతున్నారు. ఎక్కువ అడ్మిషన్లు తీసుకువచ్చిన టీచర్లకు ఖరీదైన గిఫ్టులు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News