Saturday, February 15, 2025

హైదరాబాద్ ఇక ఏఐబాద్

- Advertisement -
- Advertisement -

500పాఠశాలల్లో కృత్రిమ మేధ బోధన
భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే మైక్రోసాఫ్ట్ విస్తరణతో
యువతకు మరిన్ని ఉద్యోగాలు సంస్థ నూతన భవనం
ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను
అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయడానికి రూ.15వేల
కోట్లతో పనులు : మంత్రి శ్రీధర్‌బాబు

మైక్రోసాఫ్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏఐ ఫౌండేషన్
అకాడమీని ప్రారంభించాయి. ఈ భాగస్వామ్యంతో తెలంగాణలో 500 ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధపై పాఠాలు బోధించనున్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్‌లో ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించనున్నాము.
సిఎం రేవంత్‌రెడ్డి

మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరికెపూడి గాంధీ, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు

మన తెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతామని సి ఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురా యి అని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారణమన్నారు. మైక్రోసాఫ్ట్-, హైదరాబాద్‌ల మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు.

మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ట్లాడుతూ యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు సిఎం తెలిపారు. మైక్రోసాఫ్ట్-, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభించడంలో భాగస్వాములుగా ఉన్నామని సిఎం గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నాయని
సిఎం రేవంత్ తెలిపారు.

స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం
ఈ పెట్టుబడి తమ స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం చేయడంతో పాటు మెంటర్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్‌వర్క్ యాక్సెస్‌ను ఇస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొ చ్చారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్‌కు సిఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత, మా తెలంగాణ రైజింగ్ విన్‌కు తోడ్పాటునందిస్తుందని సిఎం రేవంత్ తెలిపారు.

ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు: మంత్రి శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఆయన వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్ వాహనాల ఉత్పత్తి కేంద్రంగా, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాలతో పాటు మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా ఈ నగరం సుస్థిరాభివృద్ధికి తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళుతోందని శ్రీధర్ బాబు చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో హైదరాబాద్ అనుబంధం మూడు దశాబ్దాల నాటిదని, తాజాగా 11 లక్షల చదరపు అడుగుల విస్ణీర్ణంలో నూతన భవనం నిర్మించడం ద్వారా తన అంకితభావాన్ని చాటుకుందని ఆయన ప్రశంసించారు.

రూ.15 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్ల ను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే హైదరాబాద్‌ను అతిపెద్ద డేటా సెంటర్ల హబ్ గా మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏఐ సిటీలో తమ కృత్రిమ మేధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించడం తమ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. సాంకేతిక దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, అడోబ్, సిఇఓ శంతను నారాయణ్‌లను ప్రపంచ టెక్నాలజీకి అందించిన ఘనత ఈ నగరానికి ఉందన్నారు. నూతన ఆవిష్కరణలకు మూలస్థంభంగా నగరం స్థానం సంపాదించుకుందన్నారు. 52 ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలు, 30కి మించిన విశ్వవిద్వాలయాలు, 6 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, 60 లక్షల మంది ఉత్సాహం ఉరకలెత్తే శ్రామికశక్తితో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందన్నారు. 90 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటిలోకి తీసుకొస్తున్నాస్తున్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News