Saturday, November 23, 2024

వచ్చే ఏడాది ఉర్దూ మీడియంలో బోధన: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాది ఉర్దూ మీడియంలో బోధన
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
స్థానిక భాషల్లో అంగన్‌వాడి పాఠ్యపుస్తకాలు


మనతెలంగాణ/ హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి అంగన్‌వాడి కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన చేపడుతామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శాసనమండలి సమావేశాల్లో సభ్యులు కల్వకుంట్ల కవిత, కూర రఘోత్తంరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రానున్న విద్యాసంవత్సరం నుంచే ఉర్దూ మీడియంలో బోధనతో పాటు కోయ, చెంచు, గొండు, ఉర్దూ భాషల్లో పాఠ్యపుస్తకాలను ముద్రించి అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే అంగన్‌వాడి కేంద్రాలకు ప్రిప్రైమరీ స్కూల్ అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేశామన్నారు.

రాష్ట్రంలో 37 వేల అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా 879 అంగన్‌వాడి కేంద్రాల పెంపు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉర్దూ మీడియంలో బోధించే టీచర్లు 437 మంది ఉన్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్‌వాడి సిబ్బంది నియామకానికి విద్యార్హత ఇబ్బందుల వస్తున్న నేపథ్యంలో అక్కడి స్థానికులతో భర్తీ కోసం వెసులుబాటులో కల్పించామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎక్కువ కేంద్రాల ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రధానంగా డబుల్ బెడ్‌రూమ్ కాలనీలు, చెంచుపెంటలు, నగరంలోని నోటిఫైడ్ బస్తీల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని వెల్లడించారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు జీతాల పెంపు పరిశీలన ఉందా అని సభ్యురాలు కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో 3500 మినీ అంగన్‌వాడి కేంద్రాల్లో పనిచేసే టీచర్లకు ఆయాలకు సమానంగా జీతాలు ఇస్తున్నామని, వాటిలో చిన్నారుల సంఖ్య పెరిగిన కేంద్రాలను అంగన్‌వాడిలు గుర్తించే ప్రతిపాదన ఉందన్నారు. అంగన్‌వాడి టీచర్ల నియామకాన్ని జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు మంత్రులతో నియామకాలు చేపట్టాలని ఆదేశంతో ఇప్పటికే ఖాళీలు భర్తీ కోసం చేపట్టిన ప్రక్రియను ప్రస్తుతం నిలిపివేస్తున్నామని వెల్లడించారు. అంగన్‌వాడి నిర్వహణకు కేంద్రం 40 శాతం వాటా, రాష్ట్రం 60 శాతం వాటాతో నిధులు మంజూరు చేస్తోందని వెల్లడించారు. గతంలో మహిళలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేసే కార్యక్రమాలను అంగన్‌వాడి కేంద్రాలు నిర్వహించేవి. సిఎం కెసిఆర్ చొరవతో చిన్నారులకు విద్యతో పాటు కుటుంబాల ఆరోగ్య నివేదికలు తయారుతో పాటు పలు సేవలను అంగన్‌వాడి టీచర్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న అంగన్‌వాడి టీచర్ల చనిపోతే.. వారి స్థానంలో ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు.

అంశాలను పరిశీలిస్తాం: సబితారెడ్డి

శాసనమండలి సభ్యులు పురాణం సతీష్‌కుమార్, రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డిలు పాఠశాల, మోడల్ స్కూల్స్‌లో హెచ్‌పిటిఎస్, పిడిల నియామకాలను చేపట్టాలని ప్రస్తావించారు. కెజిబిఎస్‌లోని సిఆర్‌పిలకు, అపరేటర్లకు పిఆర్‌సి కల్పించాలని కోరారు. పార్ట్‌టైమ్ ఉద్యోగులకు 18 నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. పలు మోడల్ స్కూల్స్‌లో ప్రిన్సిపల్స్ మినహా.. ఇతర ఉద్యోగులను రెన్యూవల్ చేయకపోవడంతో బోధన తరగతుల నిర్వహణ ఇబ్బందిగా ఉందని సభ్యులు ప్రస్తావించారు. పాఠశాలల సమస్యలపై పదేపదే ప్రస్తావిస్తున్నా పరిష్కారం నోచుకోవడం లేదని సతీష్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిష్కరం దిశగా పరిశీలిస్తున్నామని మంత్రి సబితారెడ్డి సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News