Tuesday, January 21, 2025

ఇలా ఆడితే కష్టమే టీమిండియాను వెంటాడుతున్న వైఫల్యాలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్ సమీపిస్తున్న సమయంలో టీమిండియా ఆట తీరు రోజు రోజుకు తీసికట్టుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 208 పరుగుల భారీ స్కోరును సాధించినా ఓటమి పాలుకాక తప్పలేదు. సొంత గడ్డపై ఎదురైనా ఘోర పరాజయం జట్టు లోపాలను బహిర్గతం చేసింది. ఒకప్పుడు స్వదేశంలో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉండేది. కానీ కొంత కాలంగా సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లలో సయితం భారత్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు కూడా టీమిండియాను ఓటమి నుంచి రక్షించలేక పోయింది. పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్ కారణంగా భారత్‌కు అవమానకర ఓటమి తప్పలేదు. గతంలో పెద్ద పెద్ద జట్లను సయితం అలవోకగా ఓడించిన టీమిండియా కొంత కాలంగా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచుల్లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో ఇది నిజంగా జట్టును కలవరానికి గురి చేసే అంశమేనని చెప్పాలి.

రోహిత్ వైఫల్యం..

మరోవైపు టీమిండియా ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకుంటున్న తలతోక లేని నిర్ణయాలేనని చెప్పక తప్పదు. రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ అనవసర ప్రయోగాలకు పోతున్నాడు. ఇది జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. కీలక ఆటగాళ్లను తుది జట్టుకు దూరంగా ఉంచుతున్నాడు. ఇక యువ ఆటగాళ్ల ఎంపికలోనూ స్పష్టత ఉండడం లేదు. కిందటి మ్యాచ్‌లో రాణించినా తర్వాతి పోటీలో అవకాశం దక్కడం లేదు. ఇలాంటి నిర్ణయాలు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతిస్తోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ప్రతి ఆటగాడు రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలతో సతమతమవుతున్నాడు. ఇక కొంతకాలంగా రోహిత్ ఇటు బ్యాటర్‌గా అటు కెప్టెన్‌గా పూర్తి వైఫల్యం చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఐపిఎల్‌లో మెరుగైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకోవడంతో టీమిండియాకు సంబంధించిన మూడు ఫార్మాట్ల సారథ్య బాధ్యతలను రోహిత్‌కు అప్పగించారు. అతను మాత్రం తనపై ఉంచిని నమ్మకాన్ని నిలబెట్టలేక పోతున్నాడు. ప్రతి సిరీస్‌లోనూ తేలిపోతున్నాడు. ఇక ఇటీవల ముగిసిన ఆసియాకప్‌లోనూ రోహిత్ పేలవమైన కెప్టెన్సీతో నిరాశ పరిచాడు. దీంతో ఈ టోర్నీలో టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరలేక పోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20లోనూ భారత్ ఘోర పరాజయం పాలైంది. వచ్చే నెలలోనే వరల్డ్‌కప్ ఆరంభం అవుతుండగా టీమిండియా ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.

తేలిపోతున్న బౌలర్లు, ఫీల్డర్లు

కొంత కాలంగా టీమిండియాకు బౌలింగ్, ఫీల్డింగ్ సమస్య వెంటాడుతోంది. ప్రపంచంలోనే బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్లలో భారత్ ఒకటిగా పేరు తెచ్చుకుంది. కానీ ఇటీవల కాలంలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రత్యర్థి జట్ల ముందు భారీ లక్షం ఉంచుతున్నా బౌలింగ్ వైఫల్యంతో భారత్‌కు పరాజయాలు తప్పడం లేదు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్, చాహల్, అవేశ్ ఖాన్ తదితరులు కీలక సమయంలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టు ఓటమికి కారకులవుతున్నారు. ఇక పేలవమైన ఫీల్డింగ్ కూడా భారత్ ఓటములకు మరో కారణంగా చెప్పొచ్చు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో ఫీల్డింగ్ వైఫల్యం వల్లే టీమిండియాకు అవమానకర ఓటమి తప్పలేదు. మిగిలిన మ్యాచుల్లోనైనా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ తన ప్రదర్శనను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News