Wednesday, January 22, 2025

తేలిపోయిన కుర్రాళ్లు..

- Advertisement -
- Advertisement -

క్రీడా: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ టీమిండాయకు నిరాశే మిగిల్చిందని చెప్పాలి. టెస్టుల్లో మాత్రమే భారత మెరుగైన ప్రదర్శన చేసింది. ఇక వన్డే, టి20లలో ఆతిథ్య వెస్టిండీస్ నుంచి టీమిండియాకు గట్టి పోటీనే ఎదురైంది. అతి కష్టం మీద వన్డే సిరీస్ నెగ్గినా టి20లలో మాత్రం ఓటమి తప్పలేదు. రానున్న రెండు వరల్డ్‌కప్‌లను దృష్టిలో పెట్టుకుని బిసిసిఐ యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది. వన్డేల్లో, టి20లలో సీనియర్లు విశ్రాంతి తీసుకున్నారు. వీరి బదులు కుర్రాళ్లకు అవకాశం కల్పించారు. అయితే యువ క్రికెటర్లు మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారు. ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన చాలా మంది యువ ఆటగాళ్లు విండీస్ సిరీస్‌కు వచ్చే సరికి పూర్తిగా నిరాశ పరిచారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు పరిమిత ఓవర్ల సీజన్‌లో స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యారు.

ముఖ్యంగా శాంసన్ అత్యంత పేలవమైన ఆటతో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా వృథా చేసుకున్నాడు. గతంలో సంజూకు జాతీయ జట్టులో చాలా అరుదుగా స్థానం లభించేది. అయితే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడం, సీనియర్లకు విశ్రాంతి కల్పించడంతో శాంసన్‌కు తానెంటో నిరూపించుకునే అవకాశం లభించింది. అయితే శాంసన్ మాత్రం ఈ ఛాన్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయాడు. ఐదు మ్యాచుల్లో మూడు సార్లు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. కానీ శాంసన్ మాత్రం మూడు ఇన్నింగ్స్‌లలో కూడా పూర్తిగా విఫలమయ్యాడు. అన్ని ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. ఇషాన్ కిషన్ కూడా నిరాశ పరిచాడు. వన్డేల్లో బాగానే ఆడినా టి20లకు వచ్చే సరికి పేలవమైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులే సాధించాడు. అక్షర్ పటేల్ కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశే మిగిల్చాడు.

అతను కూడా ఇటు బంతితో అటు బ్యాట్‌తో తేలిపోయాడు. అందివచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు.5 మ్యాచుల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా జట్టును ముందుండి నడిపించడంలో విఫలమయ్యాడు. ఇటు బౌలర్‌గా అటు బ్యాటర్‌గా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. అంతేగాక పేలవమైన కెప్టెన్సీతో అందివచ్చిన ఛాన్స్‌ను వృథా చేశాడు. ఒక్క తెలుగుతేజం తిలక్ వర్మ మాత్రమే అత్యంత నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచుల్లో ఏకంగా 173 పరుగులు చేసి సత్తా చాటాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లు సత్తా చాటారు. చాహల్ కూడా కాస్త బాగానే ప్రదర్శన చేశాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం భారత ఆటగాళ్లు నిరాశే మిగిల్చారని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News