Saturday, November 23, 2024

అతి విశ్వాసమే ముంచింది….

- Advertisement -
- Advertisement -

తక్కువ అంచన వేశారు.. మూల్యం చెల్లించారు

Team India defeat with Overconfidence

లీడ్స్: లార్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించడంతో ఇక సిరీస్‌లో కోహ్లి సేనకు తిరుగే ఉండదని అందరూ భావించారు. మరోవైపు కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో ఆతిథ్య ఇంగ్లండ్‌కు మరోసారి షాక్ తప్పదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. అయితే లీడ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ అనూహ్యంగా పుంజుకుంది. రెండో టెస్టులో పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచిన సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మూడో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అసాధారణ బౌలింగ్‌తో భారత్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. అతని దెబ్బకు ఓపెనర్ కెఎల్.రాహుల్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లి సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరక తప్పలేదు. మార్క్‌వుడ్ దూరం కావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనంగా మారిందని టీమిండియా బ్యాట్స్‌మెన్ భావించారు. అయితే అండర్సన్ రూపంలో మరో మెరుగైన అస్త్రం ఉందనే విషయాన్ని వారు మరిచిపోయినట్టున్నారు.

ఒకవైపు అండర్సన్ మరోవైపు శామ్ కరన్, రాబిన్సన్‌లు భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. మరోవైపు క్రెగ్ ఓవర్టన్ కూడా అద్భుతంగా రాణించాడు. ఇలా ప్రతి బౌలర్ తనవంతు పాత్ర పోషించడంతో భారత్ కోలుకోలేక పోయింది. జట్టును ఆదుకుంటారని భావించిన స్టార్ బ్యాట్స్‌మెన్‌లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరిపోయారు. రెండో మ్యాచ్‌లో శతకంతో అలరించిన ఓపెనర్ రాహుల్ ఈ టెస్టులో మాత్రం ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రాహుల్‌పై భారీ ఆశలు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ పుజారా తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు. అండర్సన్ దెబ్బకు ఒక పరుగు మాత్రమే సాధించి పెవిలియన్ బాట పట్టాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశే మిగిల్చాడు. ఏడు పరుగులు మాత్రమే సాధించి అండర్సన్ వేసిన అద్భుత బంతికి వికెట్ల వెనకాల దొరికి పోయాడు.

ఇక రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానెలు కాస్త ఆశలు చిగురింప చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరు కూడా మెరుగైన స్కోర్లను సాధించడంలో విఫలమయ్యారు. రోహిత్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానె 18 పరుగులు చేశాడు. ఇక మరే ఆటగాడు కూడా కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోయాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 78 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి భారీ స్కోరు సాధించాలని భావించిన భారత్ కనీసం వంద పరుగుల మార్క్‌ను కూడా అందుకోక పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

రూట్ దెబ్బకు..

ఇక బ్యాటింగ్‌లో తేలిపోవడంతో భారమంతా బౌలర్ల పై పడింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం కావడంతో బౌలర్లు సయితం ఒత్తిడికి గురయ్యారు. దీని ప్రభావం భారత బౌలర్లపై స్పష్టంగా కనిపించింది. ఇక ఇంగ్లండ్ ఓపెనర్లు హమీద్, రోరి బర్న్ మెరుగైన ఆరంభాన్ని అందించారు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ముదుకు సాగిపోయింది.

ఓపెనర్లు బర్న్, హమీద్‌లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్ మలాన్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగి పోయాడు. ఇక కెప్టెన్ జో రూట్ తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ మరో శతకం సాధించాడు. రూట్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ క్రమంలో 354 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించి మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో కోహ్లి సేన ఓటమిని తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News