Monday, January 20, 2025

ప్రయోగాల దశలోనే భారత్..

- Advertisement -
- Advertisement -

క్రీడా విభాగం: సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్య భారత్ పూర్తిగా సన్నద్ధం కాలేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇతర జట్లు వరల్డ్‌కప్ కోసం ఇప్పటికే బలమైన జట్లను తయారు చేసుకోగా ఆతిథ్య టీమిండియా మాత్రం ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. విశ్వకప్ కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలివుండగా టీమిండియాలో బ్యాటింగ్, బౌలింగ్ సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు తప్పలేదు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చి ప్రయోగాలు చేసి ఫలితం లేకుండా పోయాయి. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ తదితరులకు వన్డే, టి20 సిరీస్‌లలో పలు అవకాశాలు ఇచ్చారు. అయితే వన్డేల్లో ఇషాన్ కిషన్ బాగానే ఆడినా టి20లకు వచ్చే సరికి తేలిపోయాడు.

శుభ్‌మన్ గిల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సూర్యకుమార్ యాదవ్ వన్డే సిరీస్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. సూర్యకుమార్, శాంసన్, గిల్‌లు వచ్చే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు చాలా కీలకమవుతారని జట్టు యాజమాన్యం భావిస్తోంది. అందుకే వారికి వరుస అవకాశాలు కల్పిస్తోంది. గిల్ కాస్త పర్వాలేదనిపించినా శాంసన్, సూర్యకుమార్‌లు మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తున్నారు. ఇద్దరు పేలవమైన బ్యాటింగ్‌తో తమపై పెట్టుకున్న ఆశలను నీరుగార్చారు. రానున్న వరల్డ్‌కప్ టీమ్‌లో వీరిద్దరికి చోటు దక్కుతుందా అంటే కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అపార నైపుణ్యం ఉన్న వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి స్థితిలో వీరికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సెలెక్టర్లు ఇష్టపడతారని భావించడం అత్యాశే అవుతోంది.

సొంత గడ్డపై వరల్డ్‌కప్ జరుగుతున్నా ఈసారి టీమిండియా ఫేవరెట్‌గా కనిపించడం లేదు. గతంలో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్, గంభీర్, కుంబ్లే, హర్భజన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండేవారు. ఈసారి అలాంటి ఆటగాళ్లు జట్టులో కనిపించడం లేదు. కీలక ఆటగాళ్లుగా భావిస్తున్న కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, బుమ్రా తదితరులు ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్నారు. బుమ్రా, అయ్యర్, రాహుల్‌లు కోలుకున్నా వారు వరల్డ్‌కప్‌లో ఏ మేరకు రాణిస్తారో చెప్పడం కష్టమే.

ఆ ఇద్దరే కీలకం..
ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా గెలుపు అవకాశాలన్నీ సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్‌లో దాదాపు వన్డే ప్రపంచకప్ ఆడుతున్న వీరు ఎలాగైనా జట్టుకు ట్రోఫీని సాధించి పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. యువ ఆటగాళ్లతో పోల్చితే ఫిట్‌నెస్‌లో కోహ్లి ఇప్పటికే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈసారి అతను తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా కీలక బాధ్యతలు ఉన్నాయి. జట్టును ముందుండి నడిపించాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది. మరోవైపు హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు కూడా జట్టుకు చాలా కీలకంగా మారారు. బుమ్రా, అయ్యర్, రాహుల్‌లు కోలుకుంటే టీమిండియాకు కాస్త సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. మొత్తం మీద సొంత గడ్డపై జరుగనున్న వరల్డ్‌కప్ టీమిండియాకు సవాల్‌గా మారిందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News