ఐసిసి వార్షిక ర్యాంకింగ్స్
దుబాయి: టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. 202122 సీజన్‌ను భారత్ నంబర్‌వన్ హోదాలో ముగించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం మూడు ఫార్మాట్‌లకు సంబంధించిన తుది ర్యాంక్‌లను ప్రకటించింది. రోహిత్ శర్మ టి20 సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా వరుస సిరీస్‌లను గెలిచిన విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో భారత్ సొంత గడ్డపై మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లను టీమిండియా వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టి టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా 270 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకొంది. ఇంగ్లండ్ 265 పాయింట్లతో రెండో ర్యాంక్‌తోనే సరిపెట్టుకొంది. ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టినా ఆ తర్వాత భారత్ టి20లలో వరుస విజయాలు సాధించింది. ఈ క్రమంలో వరుస సిరీస్‌లను గెలిచి సత్తా చాటింది. కాగా, ప్రపంచ విజేత ఆస్ట్రేలియా మాత్రం టి20 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ మూడో, దక్షిణాఫ్రికా నాలుగో ర్యాంక్‌లో నిలిచాయి. న్యూజిలాండ్‌కు ఆరో ర్యాంక్ లభించింది.
టెస్టుల్లో ఆస్ట్రేలియా..
మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యాషెస్ సిరీస్‌ను భారీ తేడాతో గెలుచుకున్న ఆస్ట్రేలియా టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. యాషెస్ సిరీస్‌ను 40 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా 202122 సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించింది. ఈ సీజన్‌లో 19 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 128 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా 119 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక కిందటి సీజన్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ ఈసారి మూడో ర్యాంక్‌తోనే సరిపెట్టుకొంది. సౌతాఫ్రికా నాలుగో, పాకిస్థాన్ ఐదో ర్యాంక్‌లో నిలిచాయి.
కివీస్‌దే అగ్రస్థానం..
వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఐసిసి ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో కివీస్ 125 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ రెండో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచాయి. టీమిండియాకు నాలుగో స్థానం దక్కింది. కిందటి సీజన్‌లో భారత్ వన్డేల్లో అంతంత మాత్రంగానే విజయాలు సాధించింది. దీని ప్రభావం ర్యాంకింగ్స్‌పై స్పష్టంగా కనిపించింది.